7 అడుగుల కండక్టర్‌కు సీఎం రేవంత్ ఆఫర్!
– వీసీ సజ్జనార్‌కు మంత్రి పొన్నం సూచనలు.
హైదరాబాద్ ఏప్రిల్ 07(ప్రజాక్షేత్రం):తన ఎత్తు కారణంగా విధుల్లో తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారని ఆర్టీసీ బస్ కండక్టర్‌గా పని చేస్తున్న అమీన్ అహ్మద్ అన్సారీ గురించి సమాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. అతని పరిస్థితి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అతనికి ఎక్స్ వేదికగా ఓ ఆఫర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు అతనికి ఆర్టీసీలో సరైన ఉద్యోగం ఇవ్వాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్‌లో ట్యాగ్ చేశారు. మంత్రి ట్వీట్ చేయడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి అవకాశం కల్పించిన మంత్రికి, సీఎం రేవంత్ రెడ్డికి నెటిజన్లు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఎత్తు 7 అడుగుల ఎత్తు ఉన్న అమీన్ అహ్మద్ అన్సారీ మెహదీపట్నం డిపోలో ఆర్టీసీ బస్ కండక్టర్‌గా పని చేస్తున్నారు. బస్సులో 6.4 అడుగుల ఎత్తే ఉండటంతో ఉద్యోగం చేయడంలో ఇబ్బంది ఏర్పడిందని ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతడు ఏడడుగుల పొడవు ఉండటంతో విధులు నిర్వర్తించడం సవాల్ గా మారింది. బస్సుల్లో రోజూ సగటున ఐదు ట్రిప్పుల్లో పది గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోంది. తాను గంటల తరబడి తల వంచి ప్రయాణిస్తుండటంతో మెడ, వెన్ను నొప్పి, నిద్రలేమితో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్సారీ వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అతడికి ఆర్టీసీలోనే వేరొక ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ప్రయాణికులు సూచించారు. దీంతో అతని పరిస్థితి అధికారుల దృష్టికి వచ్చింది.