Praja Kshetram
తెలంగాణ

ప్ర‌భుత్వ వైద్యుల నిర్ల‌క్ష్యం.. తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన పసికందు

ప్ర‌భుత్వ వైద్యుల నిర్ల‌క్ష్యం.. తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన పసికందు

 

వనపర్తి ఏప్రిల్ 08(ప్రజాక్షేత్రం):ప్ర‌భుత్వ వైద్యుల నిర్ల‌క్ష్యం.. త‌ల్లి క‌డుపులోనే ఓ పసికందు ప్రాణాల్ని బ‌లిగొంది. ఈ క్ర‌మంలో త‌ల్లి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో.. ఆమెను ప్రాణాల‌తో కాపాడేందుకు.. చివ‌ర‌కు ప‌సికందు త‌ల‌ను మొండెను వేరు చేయాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న వ‌న‌ప‌ర్తి జిల్లా అమ‌ర‌చింత మండ‌ల కేంద్రంలో సోమ‌వారం రాత్రి చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా అమరచింత మండలం చంద్రఘడ్ గ్రామానికి చెందిన అనిత అనే గర్భిణీకి నెల‌లు నిండాయి. ఈ క్ర‌మంలో ఆమెకు సోమ‌వారం రాత్రి 11 గంట‌ల‌కు పురిటి నొప్పులు తీవ్ర‌మ‌య్యాయి. దీంతో ప్ర‌స‌వం కోసం అమ‌ర‌చింత ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి కుటుంబ స‌భ్యులు 108 అంబులెన్స్‌లో త‌ర‌లించారు. ఆ స‌మ‌యంలో డాక్ట‌ర్లు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో.. స్టాఫ్ న‌ర్సు ఆమెకు ప్ర‌స‌వం చేసేందుకు ప్ర‌య‌త్నించ‌గా సాధ్యం కాలేదు. దీంతో ఆత్మ‌కూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి తీసుకెళ్లాల‌ని గ‌ర్భిణి కుటుంబ స‌భ్యుల‌కు స్టాఫ్ న‌ర్సు సూచించారు. చేసేదేమీ లేక‌ అనిత కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలికి అక్క‌డ ప్ర‌స‌వం చేసేందుకు వైద్యులు య‌త్నించారు. పిండం వెనుక భాగం బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని.. ఆప‌రేష‌న్ చేస్తే కానీ త‌ల్లిబిడ్డ‌ను కాపాడ‌లేమ‌ని వైద్యులు సూచించారు. జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించాల‌ని ఆదేశించారు. ప్ర‌భుత్వ ఆసుపత్రులపై నమ్మకం కోల్పోయిన కుటుంబ సభ్యులు, గ‌ర్భిణిని ఆత్మకూరులోని శ్రీ సాయి నర్సింగ్ హోమ్ అనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తల్లిని కాపాడే ప్రయత్నంలో పసికందు తల మొండెం రెండు భాగాలుగా కోసి బయటకు తీశారు. తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన పసికందును చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘ‌ట‌న‌పై వనపర్తి డిఎంహెచ్‌వో శ్రీనివాసులు స్పందించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రిపి.. ఎక్క‌డ లోపం జ‌రిగిందో తెలుసుకుని చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండి పేదలకు సకాలంలో వైద్యం అందిస్తే ఆ మహిళకు గర్భశోకం మిగిలేది కాద‌నీ రెండు ప్రభుత్వ ఆసుపత్రులు దాటి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లిన తల్లికి గర్భశోకం తప్పలేదు అని బాధితురాలి కుటుంబ స‌భ్యులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Related posts