Praja Kshetram
తెలంగాణ

90 ఏళ్ల అమ్మను నడిరోడ్డుపై వదిలేసిన ఐదుగురు కుమారులు-ఆదరించిన అధికారులు.

90 ఏళ్ల అమ్మను నడిరోడ్డుపై వదిలేసిన ఐదుగురు కుమారులు

-ఆదరించిన అధికారులు.

– 90 సంవత్సరాల వృద్ధురాలు సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి ఆవరణలో వదిలేసిన మనుమడు.

– గత 10 రోజుల నుంచి తనవారి కోసం ఎదురుచూస్తున్న వృద్ధురాలు స్పందించిన అధికారులు.

సికింద్రాబాద్ ఏప్రిల్ 09(ప్రజాక్షేత్రం):నవ మాసాలు మోసి కనిపెంచిన కన్న బిడ్డలు తల్లిదండ్రులపై కర్కశంగా వ్యవహరిస్తున్నారు. కంటిపాపల వలె చూసుకున్న కుమారులు వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రుల బాధ్యత విస్మరిస్తున్నారు. ఇంటి నుంచి గెంటేస్తున్నారు. రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోతున్నారు. ముడతలు పడిన చర్మంతో ఎముకల గూడుగా మారిన ఓ 90 సంవత్సరాల వృద్ధురాలు సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి ఆవరణలో వచ్చీపోయే వారందరిని పలకరిస్తోంది. ఆ వృద్ధురాలి మనసులో మెదులుతున్న కన్నబిడ్డలు కళ్ల ఎదుట కనిపిస్తారేమోనని ఆశగా గమనిస్తోంది. తనవారి మాటలు అయినా వినిపిస్తాయేమోనని అడుగులు పడుతున్న వైపు చెవులను రిక్కిస్తోంది. అయినా, గత 10 రోజులుగా ఆమెకు నిరాశే ఎదురవుతోంది. మంగళవారం ఆమెను గమనించి దగ్గరకు వెళ్లి విషయం ఆరా తీయగా తన పేరు కాశమ్మ అని, తమది సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌ అని తెలిపారు. తనకు ఐదుగురు కొడుకులున్నరని చెప్పారు. ఎందుకో తెల్వదు తన మనుమడు ఈడ వదిలేసిండని, ఎంతకూ తిరిగొస్తలేడని, తనను పుట్టించిన ఆ దేవుడైనా పిలుస్తలేడని తడబడుతూ ఒక్కో మాటను కష్టంగా పలికారు. ఆమె కష్టాన్ని చూసి చలించి స్థానికురాలు ఒకరు భోజనం, నీళ్లు అందించారు. ఈ తల్లి కన్నపిల్లలు ఎక్కడ ఉన్నా వచ్చి తీసుకెళితే బాగుండని స్థానికులు కోరారు. ఈ ఘటనపై ఈనాడులో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు కాశమ్మను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వృద్ధురాలితో మాట్లాడారు. అనంతరం తాము ఉన్నామంటూ భరోసాను కల్పించారు. ఆమెను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు సైతం ముందుకు వచ్చాయి. టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు.

Related posts