ఆసుపత్రిలో మాస్క్‌తో.. మార్క్ శంకర్! ఫోటో వైరల్
హైదరాబాద్ ఏప్రిల్ 09(ప్రజాక్షేత్రం):ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండవ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ అగ్నిప్రమాదంలో చిక్కుకుని గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందడంతో పాటు 30 మందికి గాయాలయ్యాయి. మార్క్ శంకర్‌కి కూడా చేతులు, కాళ్లపైన గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదంలో దట్టమైన పొగ పీల్చడంతో ఊపిరితిత్తులతోకి పొగ చేరినట్టు వైద్యులు వెల్లడించారు. ఐసీయూలో అతడికి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ ఫొటో ఒకటి బయటికి వచ్చింది. ఈ ఫొటో చూస్తే ప్రమాద భయం ఇంకా అతనిలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. బిక్కు బిక్కు మంటూ ఆక్సిజన్ మాస్క్‌తో మార్క్ శంకర్ ఆ ఫోటోలో కనిపిస్తున్నారు. చేతులను చూస్తే వేడికి బొబ్బలు వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. ప్రమాద స్థాయి చూస్తే నిజంగా ఈ ప్రమాదం నుంచి మార్క్ శంకర్ బయటపడటం అదృష్టంగా భావిస్తున్నారు. అగ్ని కిలలు ఎగిసిపడుతున్న క్రమంలో తప్పించుకునే మార్గం తెలియక.. రెస్క్యూ టీమ్ వచ్చి రక్షించే దాక పిల్లలంతా ఏడుస్తూ భయంతో పరుగులు తీయడంతో మానసికంగా వారు బెదిరిపోయారని స్పష్టమవుతోంది. మార్క్ శంకర్ ను చూసేందుకు ఇప్పటికే తండ్రి పవన్ కల్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి దంపతులు సింగపూర్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా సంబంధిత ప్రమాదంపై టోమాటో స్కూల్ యాజమాన్యం స్పందిస్తూ ఓ లేఖను విడుదల చేసింది. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతున్నదని, దయచేసి ఎవరి ప్రైవసీకి భంగం కలిగించవొద్దంటూ కోరింది.