కొడుకు జైలుకి.. భర్త కాటికి
ఎల్లారెడ్డిపేట ఏప్రిల్ 12(ప్రజాక్షేత్రం):కడుపున పుట్టిన కొడుకు చివరి వరకు వెన్నంటి ఉండి వృద్దాప్యంలో జీవ గంజి పోసి సాకుతాడని తండ్రి భావిస్తే.. కన్నకొడుకే కాలయముడుగా మారి తండ్రిని హతమార్చాడు. దీంతో కొడుకును పోలీసులు జైలుకు పంపించగా భార్య తన భర్తకు అంత్యక్రియలు నిర్వహించిన సంఘటన కిషన్ దాస్ పేటలో శనివారం చోటు చేసుకుంది. పూర్తివివరాల్లోకెళితే ఎల్లారెడ్దిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట వడ్డెర కులానికి చెందిన కుంచపు కనకయ్య (50) హమాలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. కనకయ్య కొడుకు పర్శరాములు మటన్ కొట్టే కూలిపని చేసుకుంటూ జీవించేవాడు. శుక్రవారం తండ్రి కొడుకుల మధ్య మాట మాట పెరగడంతో ఆవేశానికి లోనై ఇంటి ఆరు బయట ఉన్న చేతి కర్రతో తల పై బాదడంతో ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి మృతికి కారణమైన కుమారుడిని పోలీసులు జైలుకు పంపించగా మృతుడికి ఆయన భార్య దేవవ్వ వారి ఆచారం ప్రకారం ఖననం చేసి అంత్యక్రియలు నిర్వహించడంతో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి కొడుకులు పుట్టినా కానీ లాభం లేదని ఇలాంటి వాడిని కఠినంగా శిక్షించాలని స్థానిక ప్రజలు పోలీసులను కోరారు.