మహోన్నత త్యాగశీలి అంబేద్కర్
అంధకార చీకట్లను తరమడానికి అక్షర యుద్ధం చేసి… వెలివాడలకు ఆయన వెలుగై నిలిచిండు… అంటరాని బతుకులకు ఆత్మగౌరవాన్ని తెచ్చిండు. బడి నుండి బయటకు నెట్టేస్తే చదువు మీకు అక్కర్లేదంటూ.. అవమానిస్తే.. వీధి దీపపు వెలుతురులో అక్షరాలు దిద్ది.. మన బతుకులకు పూలబాట పరిచిండు.. అవమానాలు, త్యాగాల పునాది మీద .. సమసమాజాన్ని స్థాపించిన బోదిసత్వ అతను. కాలం కంటే వేగంగా పరిగెత్తి.. విశ్వజ్ఞానిగా నిలిచాడు.. లోపాన్ని ఎత్తి చూపడం.. ప్రశ్నించడం.. ఒప్పించడం.. వాటికి పరిష్కారాలు చూపడం.. ఎక్కడ హింసకు తావులేని ఆయన ఆయుధాలు.. ఈ ప్రకృతైనా కాసేపు విశ్రాంతి తీసుకుందేమో కానీ.. ఆయన విశ్రాంతి ఎరుగలే.. కాలానికే విసుగువచ్చేలా ఆయన శోధనతో.. సమానత్వం కోసం.. సాంఘీక అసమానతలు రూపుమాపడానికి అక్షర యుద్ధం చేసి.. ఆధునిక బుద్దుడిగా నిలిచిన మహాశయా.. నీ మహోన్నత త్యాగమే నేటి ఈ మా స్వేచ్చతో కూడిన జీవితం. విధి ఇంతే అంటూ మా బతుకులను ఆపితే.. ఆ విధికే విధానాలు రాసి.. మా తలరాతలను మార్చిన.. త్యాగధనుడా. మీకేవి మా వినమ్ర నివాళులు. ఈ విశ్వం ఉన్నంత వరకూ మీరు మా మదిలో సజీవ సాక్ష్యమే… బోధిసత్వ అంబేద్కర్.. మీ ఆశయాల సాధన కోసం జ్ఞానానికి పదునుపెడుతూ నిబద్ధతతో కూడిన ప్రశ్నించే తత్వాన్ని నింపుకొని.. ముందుకు సాగుతాం.
బడిలో నుంచి గెంటేసినా… చిన్నతనం నుంచే ఊరి అవతలికి నెట్టిన .. అవమాన, చీత్కారాలకు గురైనా వాటిని కసిగా మలుచుకొని అసమానతలు లేని సమాజం కోసం ..కృషి చేసి బారతదేశానికి ఆయన వెలుగు అయ్యాడు. వీది దీపపు వెలుగు కింద చదువుకున్న ఆయన నేడు భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించి… ప్రతీ ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపిన త్యాగశీలి. తల్లి కడుపులో ఉన్న పసి బిడ్డ నుంచి పండు ముసలి వరకు అందరికి సమానమైన హక్కులు కల్పించడానికి తన సర్వస్వం దారబోసిన మహోన్నతమూర్తి అంబేద్కర్.
మహారాష్ట్రలోని సతారా జిల్లా అంబవాడ గ్రామంలో అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న రాంజీ-భీమాబాయి దంపతులకు పద్నాలుగవ సంతా నంగా జన్మించాడు. చిన్నతనం నుంచే కుల వివక్షకు గురై బడినుంచి గెంటి వేయబడ్డారు. బడిబయట, వీధి దీపాల కింద కూర్చొని నేడు అక్షరాలతో బడుగు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవాన్ని తీసుకురావడానికి తన జీవిత మంతా పోరాటం చేసిన మహోన్నత విశ్వ మేధావి. తన జీవితమంతా అక్షరాలకు ధార పోసి అణగారిన వర్గాల్లో వెలుగులు నింపడానికి ఆయన రాజ్యాంగం రాయడానికి చేసిన కృషి, త్యాగం చరిత్రలో మరెవరు చేయని సాక్ష్యానికి నిదర్శనం. అణగారిన వర్గాలకు ఆత్మగౌరవమై నిలిచిన త్యాగ మూర్తి అంబేడ్కర్ జయంతి నేడు.
పుట్టుక అనేది మనిషి అవకాశాలను, గౌరవాన్ని అస్తిత్వాన్ని అడ్డుకో కూడదు అని స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం ప్రతి భారతీయుని ప్రాథ మిక హక్కు కావాలన్నారు. బిడ్డ చనిపోయాడు తెల్ల గుడ్డ కొనుక్కురండి. కప్పడానికి అన్నారెవరో… ఆ ఇంట్లో నాలుగు గింజలు బియ్యం లేవు.. ఇక తెల్లగుడ్డు ఎక్కడి నుంచి తెస్తారు వెంటనే ఆ తల్లి చీర సగం చించి ఇచ్చింది. ఆ గుడ్డ కప్పి బిడ్డ శవాన్ని స్మశానానికి తీసుకెళ్లారు అలా మట్టిలో కలిసిపోయిన బిడ్డలు ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు. కటిక పేదరికంతో కన్నబిడ్డలను పోగొట్టుకున్న వ్యక్తి మరెవరో కాదు అంబేడ్కర్. దేశంలోని దళిత జనావళి ఆత్మగౌరవంతో బతికేందుకు సర్వస్వం త్యాగం చేసిన అంబేడ్కర్ ఆయన రెండో కొడుకు గంగాధర్ మరణించినప్పటి సందర్భం.. ఒక బిడ్డ చనిపోతే కప్పేందుకు తెల్ల గుడ్డ కూడా లేదు దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించాను. ప్రభుత్వ ఉద్యోగమో, ప్రైవేటు ఉద్యోగమో చేయకూడదా అని భావించాను. కానీ ఒకవేళ ఉద్యోగం చేసినట్లయితే అంటరాని వారి పరిస్థితి ఏమౌతుంది? నా బిడ్డ గంగాధర్ కంటే తీవ్ర అనా రోగ్యం బారిన పడతారని అంబేడ్కర్ 1943 డిసెంబర్ 12న పృథ్వీరాజ్ రోడ్డులో ఆవేదన చెందారు. ఆయన విద్యాభ్యాసం పూర్తయినా, ఎటు వంటి హోదా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ భూగోళం ఒక సృష్టి అయితే దానిపై జీవిస్తున్న మానవుడు ఆ సృష్టిలో అత్యుత్తమ భాగం. మనుషుల మధ్య విభజనలు చెల్లవు. రెండు గ్లాసుల పద్ధతి చెల్లదు. చంకలో చెప్పులు చెల్లవు. మోకాలు దాటని పంచెలు చెల్లవు. భావి భారతంలో కొందరికే హక్కులు చెల్లవు. గుడిలో, బడిలోనో ఎంట్రీ బోర్డులు చెల్లవు. మహిళలపై ఆంక్షలు చెల్లవు. ఇలా చెల్లని వాటికి అన్నింటికీ చెల్లు చిట్టి రాసిన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవితమంతా బతుకు మీదే పోరాటం. దళిత అణగారిన వర్గాల ఆత్మ గౌరవం కోసం ఆయన చేసిన త్యాగం ఈ విశ్వం ఉన్నంత వరకు చెరపని అధ్యాయం. ఆయన సర్వస్వం త్యాగం వల్లే నేటి ఈ బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవ హక్కులతో కూడిన స్వేచ్ఛా బతుకులు.
భాగ్యనగరం హైదరాబాద్ తోనూ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఎంతో అనుబంధం ఉంది హైదరాబాద్‌లో జరిగే అనేక సభలకు హాజర య్యేందుకు వచ్చేవారు. 1952లో అంబేద్కర్ కు ఉస్మానియా యూనివ ర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది అప్పటి చిట్టచివరి నిజాం అయినా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంబేడ్కర్ ను హైదరాబాద్ కు చీఫ్ జస్టి స్ గా ఉండాలని కోరినాడు. అయినా అంబేడ్కర్ తిరస్కరించారు. అలాగే కేంద్రంలో హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టక పోవడాన్ని నిరసిస్తూ తన న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కేవలం దళితులకే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్క వ్యక్తికి హక్కులు ప్రసాదించిన త్యాగమూర్తి. ఆయ నను స్మరించుకోవడంతోపాటు తన ఆశయ సాధనలో భారతదేశ సమాజ మంతా పయనించగలిగినప్పుడే ఆయన కన్న కలలు నెరవేరుతాయి. ఆ దిశగా దళిత, బడుగు బలహీన వర్గాలు చైతన్యంతో ముందుకు కదలాల్సిన ఆవశ్యకత ఉంది.
నేను నా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోలేక పోయాను. నా ప్రజల్ని పాలక వర్గంగా చూడాలని అనుకున్నాను. వాళ్లు ఇతర కులాల ప్రజలతో సమాన ప్రాతిపదికన రాజకీయ అధికారాన్ని పంచుకోవాలని అనుకున్నాను… నేనేదైతే సాధించగలిగానో .. దాన్ని కొందరు విద్యాధికులు మాత్రమే అనుభవించగలిగారు. వాళ్లు తమ మోసపూరితమైన ఆచరణ ద్వారా ఉత్త పనికిమాలిన సరుకని రుజువు చేసుకున్నారు. వాళ్లకి తమ అణగారిన సోదరుల పట్ల ఎటువంటి సానుభూతీ లేదు. వాళ్లు నా అంచనాల్ని మించిపోయారు. వాళ్లు తమకోసమే బతుకుతారు. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే బతుకుతారు. వాళ్లలో ఒక్క మనిషి కూడా సామాజిక కార్యక్రమం చేసేందుకు సిద్ధం కాదు. వాళ్లు వినాశకరమైన పథంలో సాగిపోతున్నారు. నేను ఇప్పుడు నా దృష్టిని నిరక్షరాస్యులైన గ్రామీణ జనబాహుళ్యం వైపు మళ్లించాలనుకుంటున్నాను. వాళ్లు ఇంకా కష్టాల కడలిలోనే వున్నారు. ఆర్థికంగా వాళ్ల పరిస్థితి ఏమీ మారలేదు.
దళితుల్లో విద్యావంతులు, ఉన్నత విద్యావంతులూ అయిన వర్గం నన్ను వంచించారు. విద్యని సముపార్జించిన తర్వాత, ఉన్నతవిద్యని సాధించిన తర్వాత.. వాళ్లు అణగారిన తమ సోదరులకి సేవ చేస్తారని నేను ఆశించాను. కానీ తమ పొట్టని నింపుకోవడానికి మాత్రమే తపన పడే ఈ గుమాస్తాల గుంపుని ఇక్కడ చూసి.. నేను నిర్ఘాంతపోయాను. అంటూ అంబేద్కర్ ఆవేదన పడిన ఘటనలు ఉన్నాయి. అంబేద్కర్ ఆశయాల వారసులుగా యువత ఆయన ఆశయాలను లక్ష్యంగా మలుచుకొని ముందుకు సాగాలి.
సంపత్ గడ్డం..
కామారెడ్డి జిల్లా
7893303516