Praja Kshetram
తెలంగాణ

అయ్యో.. రామచిలుక ఎంత పనిచేసింది..! పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయితీ..

అయ్యో.. రామచిలుక ఎంత పనిచేసింది..! పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయితీ..

 

హన్మకొండ ఏప్రిల్ 18(ప్రజాక్షేత్రం):చిలుక చేసిన పనికి చిలుక జ్యోతిష్యుడు, బైక్ మెకానిక్ మధ్య వివాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి విషయం పోలీస్ స్టేషన్ వద్దకు చేరింది. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పరకాల పట్టణం అంబేద్కర్ క్రాస్ సమీపంలో దాస్ అనే వ్యక్తి బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం దుకాణంలో ఉన్న దాస్ వద్దకు చిలుక జ్యోతిష్యుడు వచ్చాడు. చిలుక జోస్యం చెబుతానని చెప్పాడు. దీనికి దాస్ కూడా సరే అనడంతో చిలుక జోస్యం చెప్పేందుకు జ్యోతిష్యుడు సిద్దమయ్యాడు. చిలుక తీసిన బొమ్మను చూసి రూ.1,650 ఇస్తే తాయత్తు కడతానని జ్యోతిష్యుడు చెప్పాడు. ప్రస్తుతం తన వద్ద అంత సొమ్ము లేదు.. సాయంత్రం రావాలని సూచించడంతో జ్యోతిష్యుడు అక్కడి నుంచి వెళ్లిపోయి.. సాయంత్రం మళ్లీ దాస్ వద్దకు వచ్చాడు. చిలుక మళ్లీ అదే బొమ్మను తీస్తే తాయత్తు కట్టించుకుంటానని దాస్ చెప్పడంతో జ్యోతిష్యుడు మళ్లీ చిలుక జోస్యం చెప్పేందుకు పంజరంలోని చిలుకను బయటకు పిలిచాడు. పలుసార్లు పంజరంలో ఉన్న చిలుకను పిలుస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. అదే సమయంలో చిలుక బయటకు వచ్చి కార్డు ముక్క తీసే క్రమంలో పక్కనే ఉన్న టైర్ పేలి పెద్దశబ్దం వచ్చింది. దీంతో చిలుక భయంతో ఎగిరిపోయి పక్కనే ఉన్న టవర్ పై వాలింది. నిద్రమత్తు నుంచి తేరుకున్న జ్యోతిష్యుడు చిలుకను పట్టుకునేందుకు వెళ్లినా అది దొరకకుండా ఎగిరిపోయింది. జ్యోతిష్యుడి బాధచూడలేక మెకానిక్ దాస్ అతన్ని వైన్స్ వద్దకు తీసుకెళ్లి మద్యం కొనిచ్చాడు. కొద్దిసేపటి తరువాత జ్యోతిష్యుడు దాస్ ఇంటికి వెళ్లి నీవల్లే నా చిలుక ఎగిరిపోయిందంటూ గొడవకు దిగాడు. వీరి మధ్య మాటామాటా పెరగడంతో వివాదం తీవ్రమైంది. మూడు రోజుల క్రితం జ్యోతిష్యుడు పోలీస్ స్టేషన్లో దాస్ పై ఫిర్యాదు చేశాడు. నా చిలుకను దాస్ మాయం చేశాడని పోలీసుల వద్ద వాపోయాడు. దీంతో పోలీసులు దాస్ ను పిలిచి రామచిలుక ఏమైందని ప్రశ్నించారు. కొద్ది గంటలపాటు జ్యోతిష్యుడు, దాస్ మధ్య వాదోపవాదనలు జరిగాయి. పంచాయితీ ఎటూ తేలకపోవటంతో జ్యోతిష్యుడికి నచ్చజెప్పి పంపించి వేశారు.

Related posts