రజతోత్సవ సభ వేళ.. బిఆర్ఎస్ లో రచ్చ!
మానుకోట నేతల మధ్య బహిర్గతమైన విభేదాలు
సత్యవతి రాథోడ్‌పై విరుచుకుపడ్డ రవీందర్ రావు
ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకుల్లో ఆధిపత్యపోరు
కొద్ది రోజుల్లో ఎల్కతుర్తిలో బీఆరెస్ బహిరంగ సభ
జన సమీకరణపై విభేదాల ప్రభావం ఉంటుందా?
ఆందోళనలో గులాబీ పార్టీ నాయకులు
నష్టనివారణ చర్యలకు దిగిన అధినేత కేసీఆర్!
తెలంగాణ బ్యూరో ఏప్రిల్ 21(ప్రజాక్షేత్రం): వరంగల్ నగర శివారు ఎల్కతుర్తి కేంద్రంగా బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా రజతోత్సవ సభ నిర్వహించనున్న వేళ పార్టీ ముఖ్య నాయకుల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ఈ నెల 27వ తేదీన లక్షల మందితో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే చేస్తోంది. ఇంతకాలం పార్టీ ముఖ్య నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిర్గతమవుతుండటంతో సభ నిర్వహణ, జన సమీకరణను ప్రభావితం చేస్తాయేమోనన్న ఆందోళన గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది. మరోవైపు సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించి, రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారితీయాలనే లక్ష్యం నాయకుల మధ్య విభేదాలతో నీరుగారుతున్నదనే ఆందోళన వ్యక్తం అవుతున్నది. నష్ట నివారణకు అధినేత కేసీఆర్ తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటికిప్పుడు ఈ విభేదాలను పరిష్కరించడం సాధ్యం కాదనే అభిప్రాయాన్ని పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ విభేదాలు నాయకుల మధ్య కొనసాగుతున్నాయని వారు గుర్తు చేస్తున్నారు.
– మానుకోటలో బహిరంగ విమర్శలు
మానుకోట జిల్లా పరిధిలో ప్రస్తుతం ఒకే ఒక్క ఎమ్మెల్సీగా రవీందర్‌రావు బీఆరెస్‌కు ఉన్నారు. ఈ జిల్లాలో రజతోత్సవ సభ సమన్వయ బాధ్యతలను మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌కు పార్టీ నాయకత్వం అప్పగించింది. వాస్తవానికి మానుకోట జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా మాజీ ఎంపీ మాలోత్ కవిత ఉన్నప్పటికీ సీనియర్ నాయకురాలిగా రజతోత్సవ సభ సమన్వయ బాధ్యతలను సత్యవతికి అప్పగించారు. అయితే నాయకుల మధ్యే సమన్వయం లోపించడంతో ఆదివారం మీడియా సమావేశం సాక్షిగా ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు సత్యవతిపై బహిరంగ విమర్శలు చేశారు. సభ నిర్వహణ, జన సమీకరణ విషయంలో సత్యవతి సమన్వయం చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. పార్టీ ముఖ్య నాయకత్వం ఆమెకు బాధ్యతలు అప్పగిస్తే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. దీని ప్రభావం సభపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా జరుగుతున్న లోపాల్ని సరిదిద్దుకొని సభకు భారీ ఎత్తున జనాన్ని సమీకరించేందుకు అవసరమైన సమన్వయంతో పాటు చర్యలు తీసుకోవాలని రవీందర్‌రావు బహిరంగంగానే కోరారు. రవీందర్‌రావు బహిరంగ విమర్శలతో ఇప్పటిదాకా నివురుగప్పినట్టు ఉన్న విభేదాలు.. ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మరోవైపు సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి డీఎస్ రెడ్డినాయక్ మధ్య తొలి నుంచీ ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇద్దరూ డోర్నకల్ నియోజకవర్గంపైనే కేంద్రీకరించడంతో విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతోపాటు పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న కవితకు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య పొసగడం లేదని చెబుతున్నారు. దీంతో మానుకోట బీఆర్ఎస్‌లో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న విభేదాలు నేటికీ పార్టీని పట్టిపీడిస్తున్నాయి. అధికారం కోల్పోయినప్పటికీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, కలిసి పనిచేయాలని ఆలోచన లేకపోవడంతో క్యాడర్ కూడా చీలిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎల్కతుర్తి కేంద్రంగా నిర్వహిస్తున్న సభ ఏర్పాట్లు నిర్వహణ బాధ్యతలను హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు సభ పనుల పర్యవేక్షణ పేరుతో లేని పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పనిచేస్తున్న తమపై అనవసర పెత్తనం సాగిస్తున్నారనే భావనతో ఉన్న కొందరు నాయకులు.. ఆ అంశాన్ని తమ అనుచరుల వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ పరిణామాలతో.. నాయకుల మధ్య విభేదాలు సభపై ప్రభావం కనపరుస్తుందనే ఆందోళన పార్టీ నాయకత్వంలో వ్యక్తమవుతున్నది.
– అధికారం లేక.. దిగాలులో శ్రేణులు
రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని భావించిన బీఆర్ఎస్ మొన్నటి ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. తదుపరి పార్లమెంటు ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురైంది. ఈ కారణంగా పార్టీ నాయకత్వంతో పాటు శ్రేణుల్లో తీవ్ర నిరాశ అలముకున్నది. అధికారం కోల్పోయిన కొద్ది రోజులకే.. పార్టీ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలలో పదిమందికి పైగా పార్టీ ఫిరాయించడంతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంది. మరింత మంది నాయకులు పార్టీని వీడిపోకుండా ఈ అనుభవంతో జాగ్రత్త పడింది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీపై చేపడుతున్న రాజకీయ విమర్శలు గులాబీ పార్టీకి అనుకూలంగా మారకపోయినప్పటికీ పార్టీ దిగువ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో కొంత విశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అందివచ్చిన పార్టీ రజతోత్సవ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు పార్టీ ముఖ్య నాయకత్వం సిద్ధమైంది. ఈ పరిస్థితులలో సభ నిర్వహణ ఏమాత్రం ఇబ్బందుల పాలైనా ఎంచుకున్న లక్ష్యం నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని నాయకత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అందుకే కేసీఆర్ ఎప్పటికప్పుడు ఫామ్ హౌస్ నుంచి తగిన సూచనలతో పాటు అవసరమైన అన్నిరకాల సహకారం అందిస్తున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. సభ పూర్తయ్యే వరకు విభేదాలను పక్కనపెట్టి సక్సెస్ పై దృష్టి పెట్టాలని కేసీఆర్ ఇప్పటికే తేల్చి చెప్పారని సమాచారం. కేసీఆర్ ఆదేశాలను పార్టీ నాయకులు ఏ మేరకు అమలు చేస్తారనే చర్చ అనుచరుల్లో సాగుతున్నది