Praja Kshetram
బిజినెస్

ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి బంగారం ధరలు

ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి బంగారం ధరలు

 

 

నేషనల్ బ్యూరో ఏప్రిల్ 21(ప్రజాక్షేత్రం):ప్రపంచ మార్కెట్ల ప్రకారం చూస్తే ప్రస్తుతం పసిడికి మంచి రోజులు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వీటి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఈ క్రమంలోనే నేడు (ఏప్రిల్ 21న) స్పాట్ గోల్డ్ ధర ఒక్కసారిగా 1.7% ఎగబాకి ఔన్స్‌కి $3,383.87 స్థాయికి చేరుకుంది. దీనికి ముందు సెషన్‌లో $3,384 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. పసిడి ధరలు పెరిగిన నేపథ్యంలో దీనిపై పెట్టుబడులు చేసిన ఇన్వెస్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ పసిడిని కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మాత్రం ఈ రేట్లు షాక్ ఇస్తున్నాయి.

– ఇండియాపై ప్రభావం

ఈ బంగారం పెరుగుదల ప్రభావం భారతదేశం మీద కూడా పడింది. ఈ క్రమంలో ఏప్రిల్ 21న సోమవారం రోజు భారతదేశంలో బంగారం ధరలు కూడా పంజుకున్నాయి. గుడ్‌రిటర్న్స్ డేటా ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు రూ.9,8350కి చేరుకుంది. ఇంకా ఇలానే వృద్ధి కొనసాగితే బంగారం కొనాలనుకున్నవాళ్లు ఇంకొంత ఆలస్యం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ ధరలు ఈ వారంలో లక్ష రూపాయల స్థాయికి చేరుకునే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

– పసిడి ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్

అమెరికా డాలర్ బలహీనపడడం, డొనాల్డ్ ట్రంప్ సుంకాల నిర్ణయం, ఫెడరల్ రిజర్వ్‌తో వివాదం సహా పలు అంశాలు ఈ ధరల పెరుగుదలకు కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా 10 శాతం సుంకాలను విధించగా, చైనాపై 145 శాతం వరకు సుంకాలు విధించారు. దీనిపై స్పందించిన చైనా కూడా అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాలను ప్రకటించింది. ఈ క్రమంలో తాము రాజీ పడేది లేదని చైనా అంటోంది.

– చైనాతో చర్చలు

ట్రంప్ గత వారం చైనాతో సుంకాలపై చర్చలు జరుగుతున్నాయని, రెండు దేశాలు వాణిజ్య యుద్ధాన్ని ముగించే ఒప్పందం కుదుర్చుకోగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. మేము చైనాతో మాట్లాడుతున్నాం. వారు చాలాసార్లు సంప్రదించారని ఆయన అన్నారు. కానీ ఈ చర్చలు ఎప్పుడు కొలిక్కి వస్తాయి. ఎప్పుడు పసిడి ధరలు తగ్గుతాయని మరికొంత మంది పసిడి కొనుగోలు చేయాలని చూస్తున్న వారు అడుగుతున్నారు. ఇప్పటికే చైనా కూడా అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేయగా, తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Related posts