భూభారతి చట్టం… ప్రజలకు చుట్టం
– భూసమస్యలపై ప్రజల వద్దకే అధికారులు
– ఒక్క రూపాయి ఫీజు లేకుండానే సమస్యల పరిష్కారం
– మే 1 నుంచి మరో 28 జిల్లాల్లో ఒక్కో మండలం పైలెట్ కింద ఎంపిక
– ధరణితో అక్రమంగా భూములను లాక్కున్న వారిపై చర్యలు…
– రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీవా్సరెడ్డి
యాదాద్రి, వలిగొండ, ఏప్రిల్ 22(ప్రజాక్షేత్రం): భూ భారతి చట్టం.. ప్రజలకు చుట్టం అని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీవా్సరెడ్డి అన్నారు. మంగళవారం వలిగొండలో భూభారతి(ఆర్వోఆర్) చట్టంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించేందుకు అధికారులే ప్రజల వద్దకు వస్తారని.. భూములున్న ఆసాములు, రైతులు తమ భూమి భద్రంగా ఉందని గుండెపై చేయి వేసుకుని నిద్దురపోవాలన్న లక్ష్యంతో భూభారతి రూపొందించామన్నారు. రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నామని, ఒక్క రూపాయి ఫీజు లేకుండా భూ సమస్యలను పరిష్కరిస్తామని.., అధికారులనే క్షేత్రస్థాయికి పంపిస్తున్నామన్నారు. నెలాఖరులోగా నాలుగు మండలాల్లో అన్ని వివరాలు సేకరించి, జూన్ 2న పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నా రు. మే1వ తేదీ నుంచి మరో 28 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకుని భూభారతిని అమలు చేస్తామన్నారు. పైలెట్ మండలాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారంకోసం ఏమైనా సూచనలు వస్తే నియమనిబంధనల్లో మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. గత ప్రభుత్వం అనాలోచనతో 2020 ధరణి చట్టాన్ని తీసుకొచ్చి… ప్రజలకు అనేక ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ధరణి చట్టాన్ని తీసుకొచ్చిన మూడేళ్ల వరకు నియమ నిబంధనలు రూపొందించలేదని… విధివిధానాలు స్పష్టంగా తెలియజేయలేదని.. కేసీఆర్ నోట ఏది వస్తే ఆ మాట ప్రకారమే నడుచుకుందన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి చేసేందుకు ఇందిరమ్మ రాజ్యంలో 2025లో భూభారతి చట్టాన్ని తెచ్చామన్నారు. ఏ చట్టమైన ప్రజలకు చుట్టంలాగా, భద్రత కల్పించేలా ఉండాలే తప్ప ప్రజలకు శాపంగా మారకూడదన్నారు.
– ధరణితో భూములను లాక్కున్న వారిపై చర్యలు
ధరణి పేరుతో భూములు లాక్కున్న వారిపై చర్య లు ఉంటాయని, రాష్ట్రంలో అన్ని రెవెన్యూ గ్రామాలకు అధికారులను నియమిస్తామని మంత్రి తెలిపారు. మే10వ తేదీలోగా సర్వేయర్లు, వీఆర్వోలు, వీఆర్ఏలే మండలాలకు వస్తారని తెలిపారు. గ్రామాల్లో భూదాన్, వక్ఫ్, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే నేరుగా ఫిర్యా దు చేసే అవకాశం ఈ చట్టంలో ఉందని, ఇందుకు సంబంధించిన సమాచారం రెవెన్యూ మంత్రి, కార్యదర్శి వద్దే ఉంటుందన్నారు. అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా తప్పులు చేస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సాదాబైనామాలన కింద ఆన్లైన్లో ఉన్నటువంటి అర్హత గల దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. మే నెల నుంచి ఇళ్లను ప్రారంభించేందుకు ప్రోసిడింగ్స్ అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా ప్రభుత్వం రైతుభరోసా, రుణమాఫీ, మహాలక్ష్మి, సబ్సిడీగ్యాస్, సన్నబియ్యం పంపిణీ, ఆరోగ్యశ్రీ, రాజీవ్ యువ వికాసం, తదితర పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు.
– శిథిలావస్థలో ఉన్న రెవెన్యూ కార్యాలయాలకు భవనాలు
జిల్లాలో శిథిలావస్థలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించాలని స్థాని క ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మంత్రిని కోరా రు. జిల్లాలోని భువనగిరి, వలిగొండ, భూదాన్‌పోచంపల్లి మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాలు పూర్తి శిథిలాస్థకు చేరుకున్నాయని,నూతన భవనాలకు నిధు లు మంజూరు చేయాలని, వలిగొండలో సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. దీనిపై మంత్రి శ్రీనివా్‌సరెడ్డి స్పందిస్తూ జిల్లాలో శిథిలావస్థలో ఉన్నటువంటి కార్యాలయాలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
– కలెక్టర్ గారూ మంచినీళ్లు తాగండి
భూభారతి సదస్సులో కలెక్టర్ ఎం.హనుమంతరావు చట్టంపై అరగంట సేపు అనర్గళంగా మాట్లాడారు. చట్టం గురించి సమగ్రంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. గతంలో ధరణిలోని లోపాలను కూడా సవివరంగా ప్రజలకు వివరించారు. కలెక్టర్ ప్రజలకు అవగాహన కల్పిస్తుండగా…త్వరగా క్లోజ్ చేయండి కలెక్టర్ గారు అని మంత్రి కోరారు. ఆయన మాట్లాడిన తర్వాత మంచినీళ్లు తాగండి అని కలెక్టర్‌కు సూచించారు.