రూ.7లకు కక్కుర్తి పడ్డ మెడికల్ షాపు
– మైనర్ ప్రాణం బలి
– సెలైన్‌లో పెయిన్‌కిల్లర్స్ కలిపి తీసుకున్న కేసులో ఇద్దరి అరెస్టు
– డబ్బుకు ఆశపడి డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండానే అమ్ముతున్న మెడికల్‌స్టోర్ యజమాని
– ఓవర్‌డోస్ కావడంతో ఓ బాలుడు మృతి, మరో ఇద్దరికి చికిత్స
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 23(ప్రజాక్షేత్రం):రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలో డ్రగ్స్ ఓవర్ డోస్తో ఓ మైనర్ చనిపోగా, మరో ఇద్దరు చావు బతుకుల్లో ఉన్న ఘటనలో దారుణమైన నిజాలు వెలుగుచూశాయి. పోలీసులు చేపట్టిన దర్యాప్తులో కేవలం రూ.7కు కక్కుర్తి పడ్డ మందుల దుకాణం యజమాని వైద్యుడి చీటి లేకుండానే ఈ మాత్రల్ని గుట్టుగా అమ్మేశాడు. వైద్యుడు రాసిన మందుల ప్రిస్కిప్షన్ ఉంటేనే మెడికల్ షాపుల్లో నొప్పి నివారణ మాత్రలు ఇవ్వాలి. ఇలా కాకుండా డబ్బులకు ఆశపడి ఒకరి ప్రాణం బలితీసుకున్నాడు.
మెడికల్ షాపులో కొన్న ట్యాబ్లెట్లను సెలైన్ వాటర్‌లో కలిపి ఇంజెక్ట్ చేసుకున్న మైనర్ బాలుడు డోసు ఎక్కువై ప్రాణాలు విడిచాడు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సెలైన్ నీళ్లలో నొప్పి నివారణ మాత్రలు కలిపి తీసుకున్న కేసులో టీజీ న్యాబ్, బాలాపూర్ పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. నిందితులు డబ్బుకు ఆశపడి నొప్పి నివారణ మాత్రల్ని అడ్డగోలుగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం షహీన్‌నగర్‌కు చెందిన సయీద్ సాహిల్(21) యూపీవీసీ కిటికీలు బిగించే పనులు చేస్తుంటాడు. చెడు వ్యసనాలకు బానిసై మత్తు పదార్థాలు తీసుకోవడం ప్రారంభించాడు. ఆన్‌లైన్, కొందరి ప్రభావంతో మత్తు కోసం ఏడాది క్రితం నుంచి నొప్పి నివారణ మాత్రల్ని సెలైన్ వాటర్‌లో కలిపి తీసుకునేవాడు. వాస్తవానికి ఈ నొప్పి నివారణ మాత్రలు వైద్యుల ప్రిస్కిప్షన్ ఉంటేనే మెడికల్ షాపుల్లో విక్రయించాలి.
– చిటీ లేకుండా విక్రయించడంతో
శంషాబాద్‌లోని శ్రీనివాస మెడికల్ స్టోర్ యజమాని సిరోమణి జగన్నాథం ప్రవీణ్ మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. రూ.39 విలువ చేసే ఒక్కో మాత్రను డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా రూ.46 చొప్పున సాహిల్‌కు విక్రయిస్తున్నాడు. ఈ మాత్రలతో తయారుచేసిన మత్తు పదార్థాన్ని సాహిల్ తాను తీసుకోవడంతో పాటు ఇతరులకు విక్రయించడం మొదలుపెట్టాడు. సెలైన్‌లో ఒక్కో మాత్రను కలిపి ఇంజెక్షన్‌తో ఇచ్చినందుకు రూ.150 చొప్పున తీసుకునేవాడు.
ఈ క్రమంలోనే బాలాపూర్ మండలం సుల్తాన్‌పూర్ టౌన్‌షిప్‌కు చెందిన ఇంటర్ చదివే బాలుడు(17), హఫీజ్‌బాబానగర్‌కు చెందిన వెల్డింగ్ పనులు చేసుకునే మరో బాలుడు(17), ఫుడ్‌డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న ఇంతియాజ్(22) ముగ్గురూ సాహిల్ దగ్గర మాత్రలతో తయారుచేసిన మత్తు పదార్థం తీసుకునేవారు.
– రెండు రోజుల తర్వాత మృతి
ఈ నెల 17వ తేదీన ముగ్గురూ ఇంజెక్షన్ ద్వారా తీసుకున్నారు. డోసు ఎక్కువై తీవ్ర వాంతులతో అపస్మరాక స్థితిలోకి వెళ్లిన మైనర్ బాలుడు రెండ్రోజుల తర్వాత మరణించాడు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన బాలాపూర్ పోలీసులు టీజీన్యాబ్ బృందంతో కలిసి సాహిల్, మెడికల్ షాపు యజమాని జగన్నాథం ప్రవీణ్‌ను అరెస్టు చేశారు. ప్రాణాల మీదకు తెచ్చుకున్న ముగ్గురూ ఏడాది నుంచి మత్తు పదార్థం తీసుకుంటున్నట్లు తెలిపారు. పోలీసులు జగన్నాథం దుకాణంలోని మాత్రల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతని దగ్గర మహ్మద్ అయాన్(20), జునైద్ ఖాన్(25), బాలుడు(16) నొప్పి నివారణ మాత్రలు కొనుగోలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.