Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

ఉగ్రవాదాన్ని నిరోధించాలి

ఉగ్రవాదాన్ని నిరోధించాలి

– చంద్రమౌళి భౌతికకాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి

గాజువాక/విశాఖపట్నం ఏప్రిల్ 23(ప్రజాక్షేత్రం):ఉగ్రవాదాన్ని నిరోధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లా పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్ర దాడిలో విశాఖలోని బీచ్‌ రోడ్డు ప్రాంతానికి చెందిన రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి మృతి చెందడంతో ఆయన భౌతికకాయాన్ని బుధవారం రాత్రి విశాఖ ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. చంద్రమౌళి భౌతికకాయం వద్ద పూలు జల్లి, జాతీయ జెండాను కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చంద్ర బాబు మాట్లాడుతూ కాశ్మీర్‌లో జరిగిన కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన ఇద్దరు మృతి చెందారని తెలిపారు. వారిలో విశాఖకు చెందిన చంద్రమౌళి ఒకరిని చెప్పారు. పథకం ప్రకారమే ఉగ్రవాదులు ఈ దాడికి దిగారన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తేవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని తెలిపారు. బాధిత కుటుంబాలు నిలదొక్కుకోవడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో వ్యవహరించి భద్రతను పెంచుతామన్నారు. రాష్ట్రంలో సముద్రతీరం ఎక్కువగా ఉన్నందున మరింత భద్రత అవసరమని తెలిపారు. కాశ్మీర్‌ సుందర ప్రదేశమని, దాన్ని దెబ్బతీయడానికే ఉగ్రవాదులు ఈ కుట్ర చేశారని అన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన అవసరముందని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, ఎమ్మెల్యేలు గణబాబు, పంచకర్ల రమేష్‌బాబు, విష్ణుకుమార్‌ రాజు పాల్గొన్నారు.

Related posts