‘మా ఫ్రెండ్‌కు పంపబోయి మీకు ఫోన్ పే చేశా’ : ఇలాంటి కాల్స్‌ను అస్సలు నమ్మకండి.
– అపరిచితుల నగదు లావాదేవీలతో చిక్కులు
– సైబర్ క్రైమ్స్‌లో నయా ట్రెండ్
– అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
హైదరాబాద్ ఏప్రిల్ 24(ప్రజాక్షేత్రం):యూపీఐ వినియోగదారులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. అపరిచిత వ్యక్తులతో నగదు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సైబర్‌క్రైమ్ ఏసీపీ శివమారుతి స్పష్టం చేశారు. సొమ్ము పోయిన గంట వ్యవధిలో 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
- ప్రైవేటు ఉద్యోగి ఫోన్‌పేలో రూ.2 వేలు జమ చేసినట్టు సందేశం వచ్చింది. లింక్‌పై క్లిక్ చేసి పిన్ ఎంటర్ చేయగానే ఖాతాలో ఉన్న రూ.లక్షన్నర సొమ్ము మాయమైంది.
- ఇంజినీరింగ్ విద్యార్థికి తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మిత్రుడికి పంపబోయి పొరపాటున రూ.5 వేలు ఖాతాలోకి వచ్చాయని తెలిపాడు. ఏపీకే లింక్ పంపి విత్‌డ్రా చేసుకోవచ్చని రూ.50 వేలు కాజేశాడు.
ఇలా చెప్పి లింకు పంపించి
సైబర్ మోసగాళ్లు సెల్‌ఫోన్ నంబర్లకు బ్యాంకు నుంచి వచ్చినట్టు మెసేజ్ పంపుతున్నారు. ఆ లింక్‌లను క్లిక్ చేయగానే ఏపీకే ఫైల్స్ పంపి యూపీఐ వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. బ్యాంకు ఖాతా, ఆధార్, పాన్‌కార్డు, ఓటీపీ తదితర వివరాలను సేకరించి నగదు దోచుకుంటున్నారు. నకిలీ కాల్ సెంటర్ ద్వారా ఫోన్ చేసి ఫోన్ పే, పేటీఎం, గూగుల్‌పే ప్రతినిధులమంటూ ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు తీసుకుంటారు. యాప్‌లో సాంకేతిక సమస్యను అధిగమించేందుకు కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నట్టు వారు పంపే లింకు ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి సొమ్మంతా కాజేస్తున్నారు.
