పెట్రోల్, డీజిల్ కార్ల ధరలకే ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్! ఐదు నిమిషాల చార్జింగ్‌తో 520 కి.మీ. ప్రయాణం!
– ఆటో పరిశ్రమలో బ్యాటరీ విప్లవం
– తక్కువ ధరకే బ్యాటరీ తయారు చేసే సాంకేతికత
– ఆవిష్కరించిన చైనా కంపెనీ సీఏటీఎల్
హైదరాబాద్ ఏప్రిల్ 24(ప్రజాక్షేత్రం):ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీల సరఫరాలో అతిపెద్ద కంపెనీ.. ఆటోమొబైల్ పరిశ్రమ అడ్డంకులన్నింటినీ అధిగమించి దూసుకుపోయే ఆవిష్కరణను ప్రకటించింది. తేలికపాటి, తక్కువ ధరకు లభ్యమయ్యే, వేగంగా చార్జ్ అయ్యే, చలికి తక్కువ నిరోధకత కలిగిన బ్యాటరీల తయారీకి తమ పురోగతి అవకాశం కల్పిస్తుందని చైనాకు చెందిన బ్యాటరీల తయారీ సంస్థ సీఏటీఎల్ సోమవారం ప్రకటించింది. వీటన్నింటితోపాటు మైలేజీ కూడా గణనీయంగా పెరుతుందని తెలిపింది. ఇక గంటల కొద్దీ చార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని, తమ సాంకేతిక పరిజ్ఞానంతో ఐదు నిమిషాల చార్జింగ్‌తోనే 520 కిలోమీటర్ల దూరం ప్రయాణించే అవకాశం ఈవీకి కలుగుతుందని వెల్లడించింది. అయితే.. ఈ పరిజ్ఞానం అందుబాటులోకి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని భావిస్తున్నారు. ఒక్కసారి ఈ పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే.. పెట్రోల్, డీజిల్ వంటి కార్ల ధరకు పోటీగా తక్కువలోనే ఈవీలు లభిస్తాయి. ప్రపంచంలోని ఈవీలకు అవసరమైన బ్యాటరీలలో మూడో వంతు బ్యాటరీలు ఈ పరిజ్ఞానాన్ని డెవలప్ చేసిన సీఏటీఎల్ ప్రస్తుతం తయారు చేస్తున్నదని ది టైమ్స్ పేర్కొన్నది. టెస్లా సహా ప్రపంచ అతిపెద్ద ఈవీల తయారీ సంస్థలకు ఈ సంస్థే బ్యాటరీలను అందిస్తున్నది. షాంఘై ఆటోషో సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో టీఏటీఎల్ కంపెనీ ఈ కొత్త బ్యాటరీ గురించి వివరించింది. కారులోపల ఇమిడ్చే ఒకే పెద్ద బ్యాటరీకి బదులుగా ఆగ్జిలరీ బ్యాటరీలను తమ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం ఎక్కువ ఈవీలకు ఇటువంటి సింగిల్ బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు. ఈ బ్యాటరీలో తక్కువ గ్రాఫైట్‌ను (నల్లసీసం) వాడుతారు. నల్లసీసం ఎక్కువగా వాడటం వల్లే బ్యాటరీ ఖర్చు అధికంగా ఉంటున్నది. ఎలక్ట్రిక్ వాహనాల ఖర్చులో దాని బ్యాటరీకి అయ్యేదే మూడింట ఒక వంతుగా ఉంటున్నది. రెండు లేదా మూడు సంవత్సరాల వ్యవధిలో లేదంటే అంతకు ముందే కొత్త బ్యాటరీ సాంకేతికత అందుబాటులోకి వస్తుందని సీఏటీఎల్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కో ప్రెసిడెంట్ ఔయాంగ్ చుయింగ్ తెలిపారు. ఈ కొత్త బ్యాటరీలను ఏ ఈవీ సంస్థ తొలిసారి ఉపయోగిస్తుందనే విషయాన్ని మాత్రం ఆయన వివరించలేదు. చైనాకు చెందిన బీవైడీ ఇటీవల మార్చిలో కొత్త చార్జింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. దీనితో ఐదు నిమిషాల చార్జింగ్‌తో 470 కిలోమీటర్లు ప్రయణించవచ్చు. బీవైడీ కంపెనీ టెస్లాకు చైనాలో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నది. సీఏటీఎల్‌కు కూడా అతిపెద్ద ప్రత్యర్థిగా ఉన్నది. అయితే.. టీఏటీఎల్‌కు సొంతగా కార్ల తయారీ పరిశ్రమ లేదు.