ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి విజయం
హైదరాబాద్ ఏప్రిల్ 25(ప్రజాక్షేత్రం):స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ విజయం సాధించారు. ఎంఐఎంకు 63 ఓట్లురాగా.. బీజేపీకి 25 ఓట్లు వచ్చాయి. 38 ఓట్ల మెజార్టీతో ఎంఐఎం అభ్యర్ధి గెలుపొందారు. క్రాస్ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకున్న బీజేపీకి నిరాశ ఎదురైంది. తమకున్న 25 ఓట్లు మాత్రమే బీజేపీకి పోలయ్యాయి. ఎంఐఎంకు చెందిన 49, కాంగ్రెస్‌కు చెందిన 14 ఓట్లు కలిపి 63 ఓట్లు ఎంఐఎం అభ్యర్ధికి పోలయ్యాయి. దీంతో ఆ పార్టీ అభ్యర్ధి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.
– బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు మాట్లాడుతూ..
బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఓటు వేయకుండా అడ్డుకున్న ఎంఐఎంను ఎలక్షన్ కమిషన్ ఎందుకు రద్దు చేయవద్దని తాను ప్రశ్నిస్తున్నానని బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు అన్నారు. కేటీర్ ఓట్లు వేయొద్దు అని చెప్తారని, ఈ పార్టీ ఇప్పుడు ఏ విధంగా ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు సహకరించిందని, ఎంఐఎం చెప్పు చేతుల్లో కాంగ్రెస్ పని చేస్తోందని విమర్శించారు. ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటే అనేది అర్థమవుతుందన్నారు. హైదరాబాద్ తెలంగాణ ప్రజలు ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో సహకరించిన బీజేపీ నాయకత్వానికి అందరికీ ధన్యవాదములని చెప్పారు. తనకు ఓటేసిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీసియో సభ్యులకు గౌతమ్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్ హాల్‌లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. కాగా ఈ నెల 23న జరిగిన ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయింది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌లో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియె సభ్యులు పాల్గొన్నారు. ఓటింగ్‌కు బీఆర్ఎస్ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. పోటీలో ఎంఐఎం అభ్యర్దిగా మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు ఉన్నారు.
– పార్టీ ల బలాబలాలు
ఎంఐఎంకు 41 కార్పొరేటర్లు, 9 ఎక్స్ ఆఫీసీయో సభ్యులు మొత్తం 50..
బీజేపీకి 18 కార్పొరేటర్లు, 6 ఎక్స్ ఆఫీసీయో సభ్యులు మొత్తం 24..
కాంగ్రెస్‌కు ఏడుగురు కార్పొరేటర్లు, ఏడుగురు ఎక్స్ ఆఫీసీయో సభ్యులు మొత్తం 14..
బీఆర్ఎస్‌కు 15 కార్పొరేటర్లు, 9 ఎక్స్ ఆఫీసీయో సభ్యులు మొత్తం 24..