Praja Kshetram
తెలంగాణ

డ్రైవింగ్ లైసెన్స్కు ఈజీగా అప్లై చేసుకోండిలా – కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే

డ్రైవింగ్ లైసెన్స్కు ఈజీగా అప్లై చేసుకోండిలా – కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే

 

– డ్రైవింగ్ లైసైన్స్కు దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన      పత్రాలు ఏవి?

– శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఎలా?

హైదరాబాద్ ఏప్రిల్ 26(ప్రజాక్షేత్రం):వాహనం ఏదైనప్పటికీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరి. మోటార్ వెహికిల్ చట్టం నిబంధనలు మరింత కఠినంగా మారిన తర్వాత లైసెన్స్ తప్పక తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే కనీసం ఎంత వయసు ఉండాలి? ఏయే ధ్రువపత్రాలు అవసరం? లైసెన్స్ కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? అనే విషయాలపై చాలా మందికి సందేహాలుంటాయి. ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విధంగా సులభంగా దరఖాస్తు చేసుకోండి.

– డ్రైవింగ్ లైసెన్స్కు ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి

డ్రైవింగ్ లైసెన్స్‌ తీసుకునే వ్యక్తికి 18 ఏళ్లు నిండి ఉండాలి. ముందుగా లెర్నింగ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్‌కార్డు, అడ్రస్, వయసు ధ్రువపత్రాలతో పాటు సెల్ఫోన్ నంబర్‌తో మీసేవ లేదా ఇతర కంప్యూటర్‌ కేంద్రాల్లో ఫీజు చెల్లించి ముందుగా స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కేటాయించిన రోజు రవాణా శాఖ కార్యాలయానికి(ఆర్టీవో కార్యాలయం) వెళ్లి దరఖాస్తుకు ఆధార్, చిరునామా, వయసు ధ్రువపత్రాల జిరాక్స్‌ ప్రతులను జత చేసి కౌంటర్‌లో అందజేయాల్సి ఉంటుంది. అధికారులు వాటిని పరిశీలించి దరఖాస్తుదారుడి ఫొటో తీస్తారు.

– పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ ఇలా

అనంతరం కార్యాలయంలో రహదారి నిబంధనలపై కంప్యూటర్‌ పరీక్ష(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) నిర్వహిస్తారు. టెస్ట్లో ఇరవై మార్కులకు 12 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లు. అర్హత సాధించిన వారికి అధికారులు 6 నెలల కాలవ్యవధితో లెర్నింగ్‌ లైసెన్స్‌ను జారీ చేస్తారు. ఆరు నెలల్లోపు మళ్లీ వచ్చి శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్స్‌(పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్) తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వారు కేటాయించిన రోజు ఆర్టీఏ ఆఫీస్కు వెళ్లాలి. ట్రాక్‌ వద్దకు వెళ్లి సిబ్బందికి దరఖాస్తును (స్లాట్‌ పేపర్లు) అందజేయాలి. అధికారుల సమక్షంలో వాహనాన్ని నడపాల్సి ఉంటుంది. తడబాటు లేకుండా నడుపుతున్నట్లు వారు సంతృప్తి చెందినట్లయితే డ్రైవింగ్‌ లైసెన్స్ను జారీ చేస్తారు. డీఎల్‌ కార్డును పోస్ట్‌ ద్వారా మీ అడ్రస్కు పంపిస్తారు.

Related posts