Praja Kshetram
పాలిటిక్స్

సభకు సర్వం సిద్ధం.. జోన్ల వారీగా రూట్ మ్యాప్

సభకు సర్వం సిద్ధం.. జోన్ల వారీగా రూట్ మ్యాప్

– ఎల్కతుర్తిలో విస్తృత ఏర్పాట్లు

– భారీ ఎత్తున జన సమీకరణ

– ఉమ్మడి జిల్లాల వారీగా జోన్లు

– పార్కింగ్ కోసం ఐదు జోన్లు

– ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్తలు

– పెద్దఎత్తున పోలీసు బందోబస్తు

– సభ ఏర్పాట్లు పరిశీలించిన సిపి

తెలంగాణ బ్యూరో ఏప్రిల్ 26(ప్రజాక్షేత్రం):హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో ఆదివారం నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. లక్షలాదిమంది తరలిరానున్నందున ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎల్కతుర్తి లోని 1200 ఎకరాల విశాల ప్రాంగణంలో సభ నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు. వాహనాల కోసం మరో వెయ్యి ఎకరాలలో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. శనివారం మిగిలిన చిన్నాచితక పనులను పూర్తి చేశారు. సభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చే వారికోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ ఖరారు చేశారు. నిర్దేశిత పార్కింగ్ స్థలాలలోనే ఉమ్మడి జిల్లాల వారీగా వాహనాలను పార్కింగ్ చేసే విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

సభ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భారీగా పోలీసులు విధులు నిర్వహించనున్నారు. అవసరమైన చోట్ల బీఆర్ఎస్ కు చెందిన వాలంటీర్లు కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా చూసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృతంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికీ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సభా స్థలంతో పాటు పార్కింగ్ రూటు మాప్ తదితర వాటిని స్వయంగా పరిశీలించారు. 30-40 వేల వాహనాలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. వేసవి తీవ్రత పెరిగినందున 10 లక్షల వాటర్‌ బాటిల్స్‌, మజ్జిగ ప్యాకెట్లు, వెయ్యికి పైగా వైద్య బృందాలు, 20 అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సభ కోసం ముందు జాగ్రత్తగా 200 జనరేటర్లను ప్రత్యేకంగా తెప్పించారు.

– బీఆర్ఎస్ చరిత్రలో మరో ఘట్టం

తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ టీఆర్‌ఎస్ ఇటీవల బీఆర్ఎస్‌ గా మారింది. ఈ 25 ఎండ్లు తెలంగాణ కోసం, తెలంగాణ ప్ర‌జ‌ల కోస‌మే ప‌ని చేసిన పార్టీగా ఆ పార్టీ నేతలు భావిస్తుంటారు. మ‌రో 25 ఏండ్ల కోసం మార్గ‌నిర్దేశం చేసేందుకు స‌భ పెడుతున్నామని చెబుతున్నారు. చరిత్రలో ఎల్కతుర్తి సభ మరో ఘట్టంగా నిలిచిపోతుందని భావిస్తున్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల 60 ఏండ్ల క‌ల‌ను సాకారం చేసింది. ఈ క్రమంలో 14 ఏండ్ల పాటు తెలంగాణ కోసం కొట్లాడారు. 10 ఏండ్ల పాటు తెలంగాణ‌లో అధికారం చెలాయించారు. ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు.

– జిల్లాల వారీగా పార్కింగుకు ఐదు జోన్లు

పార్కింగ్ కు సంబంధించి జోన్లో వారీగా రూట్ మ్యాప్ వివరాలు ఇలా ఉన్నాయి

జోన్ 1 : వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, ములుగు, పినపాక, భద్రాచలం, అశ్వారావు పేట, కొత్తగూడెం, ఇల్లందు రూట్ – మల్లంపల్లి – గుండెప్పాడ్ – వంగహపాడ్ – యూ టర్న్ NH – 163 – హాసన్ పర్తి – ఎల్కతుర్తి

జోన్ 2 : ఉమ్మడి నల్గొండ, రంగ రెడ్డి, హైదరాబాద్ & మహబూబ్ నగర్ నియోజవర్గాలు,ఇల్లందు, వైరా, ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర.ఖమ్మం నుండి వచ్చే వారికి మమునూర్ – నాయుడు పెట్రోల్ పంపు – టయోటా షో రూమ్ – కడిపికొండ బ్రిడ్జి – మడికొండ – NH 163 బై పాస్ రోడ్డు టోల్ గేట్ దేవన్నపేట – మేడిపల్లి – అనంత సాగర్, ఇతరులకు కరుణపురం – NH 163 బై పాస్ టోల్ గేట్ – దేవన్నపేట – మేడిపల్లి – అనంత సాగర్ పార్కింగ్

జోన్ 3 : జనగాం, స్టేషన్ ఘనపూర్ రూరూట్ – ధర్మసాగర్ – దేవనూర్ – దామెర – చింతలపల్లి పార్కింగ్

జోన్ 4: ఉమ్మడి కరీంనగర్ నియోజకవర్గాలు మరియు చెన్నూరు, మంచిర్యాల,బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, పరకాల (కొంత భాగం)రూట్ – కరీంనగర్ – హుజుర్నగర్ – కోతులనడుమ – గ్రానైట్ రోడ్ పార్కింగ్

జోన్ 5: ఉమ్మడి మెదక్, నిజామాబాద్ నియోజకవర్గాలు మరియు నిర్మల్, అదిలాబాద్, ఖానాపూర్, బోథన్ రూట్ – సిద్దిపేట – ముల్కనూర్ – ఇందిరా నగర్ పార్కింగ్లు ఏర్పాటు చేసినట్లు బిఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ చెప్పారు.

ఇదిలా ఉండగా సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆ పార్టీ అధినేత కేసిఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే హరీష్ రావు ఇతర పార్టీ నాయకులు సభ ఏర్పాట్లను ఇప్పటికే పరిశీలించారు. జన సమీకరణకు భారీ ఎత్తున ప్రణాళికలు రూపొందించి అమలచేస్తున్నారు. ఈ సభ విజయవంతం పై సభలో ప్రసంగాలపై ఆ పార్టీ నాయకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరోసారి తెలంగాణపై కేసీఆర్, బీఆర్ఎస్ ముద్ర బలంగా వేయాలని లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా ఈ సభను నిర్వహిస్తున్నారు.

Related posts