Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

మీకు ఈ డిజిటల్‌ కార్డు కావాలా? – సచివాలయాల్లోనే అందిస్తోన్న ప్రభుత్వం

మీకు ఈ డిజిటల్‌ కార్డు కావాలా? – సచివాలయాల్లోనే అందిస్తోన్న ప్రభుత్వం

 

– సీనియర్‌ సిటిజన్‌లకు డిజిటల్‌ కార్డులు

– సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ

అమరావతి ఏప్రిల్ 27(ప్రజాక్షేత్రం):వయోవృద్ధులకు గుర్తింపుగా ఇచ్చే సీనియర్‌ సిటిజన్‌ కార్డు కోసం కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఈ డిజిటల్‌ కార్డులు పొందేందుకు సేవల్ని అందిస్తోంది. 60 ఏళ్లు నిండిన పురుషులు, 58 ఏళ్లు నిండిన మహిళలకు ఈ సీనియర్‌ సిటిజన్‌ కార్డుల్ని ఇస్తున్నారు. వీటిని వినియోగించుకుని వృద్ధులు అనేక సేవల్ని పొందేందుకు అవకాశం ఉంటుంది.

– కార్డుపై ఏముంటాయంటే

వృద్ధులకు ఇచ్చే సీనియర్‌ సిటిజన్‌ కార్డుపై బ్లడ్‌ గ్రూప్, అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు ఉంటాయి. అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ వివరాలు ఉపయోగపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పది నిమిషాల్లో కార్డు జారీ: పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో, ఆధార్‌ కార్డు, బ్యాంకు అకౌంట్, కుల ధ్రువపత్రం తదితర వివరాలతో మీ సచివాలయాన్ని సంప్రదించాలి. ఆధార్‌తో లింక్ అయ్యి సిమ్‌ ఉన్న ఫోన్ తీసుకెళ్లాలి. కార్డు జారీ ప్రక్రియ కేవలం 10 నిమిషాల్లో పూర్తవుతుంది.

– ఈ కార్డుతో ఉపయోగాలు

ఈ కార్డు ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల్లో రాయితీలను ఎంతో ఈజీగా పొందవచ్చు. ఇతర గుర్తింపు కార్డులు చూపించాల్సిన అవసరం ఉండదు. ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు సైతం ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఆర్టీసీ బస్సుల్లో 25% రాయితీ లభిస్తుంది. రైళ్లలోనూ కింది బెర్త్‌లు కేటాయిస్తారు. బ్యాంకింగ్, పోస్టాఫీసుల్లో డిపాజిట్లపై అధిక వడ్డీ పొందడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఈ కార్డు ఉన్న వారికి కేసుల విచారణ విషయంలోనూ కోర్టులు ప్రాధాన్యం ఇస్తాయి. పాస్‌పోర్టు సేవల్లోనూ ఫీజులోనూ తగ్గింపు ఉంటుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 0.5% అదనపు వడ్డీ రేటు లభించడంతో పాటు, 80 ఏళ్లుపైబడిన వారికి అదనంగా 1% ఇస్తారు.

– పన్ను మినహాయింపులు

60 సంవత్సరాలు పైబడిన వారికి 3 లక్షల రూపాయల వరకు, 80 ఏళ్లు పైబడిన వారికి 5 లక్షల రూపాయల వరకు ఆదాయపన్ను మినహాయింపు లభిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై 80C సెక్షన్‌ కింద పన్ను తగ్గింపు ఉంటుంది. సీనియర్‌ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై లక్ష రూపాయల వరకూ TDS మినహాయింపు పరిమితి వర్తిస్తుంది. ఇలాంటి చాలా లాభాలు ఈ సీనియర్‌ సిటిజన్‌ కార్డుతో ఉన్నాయి.

Related posts