కొత్త కార్డులయితే మంజూరయ్యాయి కానీ – పేర్లు మాత్రం వేరొకరి రేషన్ కార్డుల్లో!
– కొత్త రేషన్ కార్డుదారుల జాబితాల్లో ఉన్న కొంతమందికి చేదుఅనుభవం
– సాంకేతిక సమస్యలు కారణంగా రేషన్ అందని వైనం
– వచ్చే నెలలోగా సరిచేస్తామంటున్న అధికారులు
తెలంగాణ బ్యూరో ఏప్రిల్ 27(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. లబ్ధిదారులుగా ఎంపికైన వారు ఎంతగానో సంతోషించారు. నూతన కార్డుదారులకు ఉగాది నుంచే సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. విడుదలైన జాబితాలో పేర్లున్నటువంటి లబ్ధిదారులు రేషన్ కోసం దుకాణాలకు వెళ్తే కొందరికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కొందరి పేర్లు రక్తసంబంధీకులకు సంబంధించిన పాత కార్డుల్లో నమోదవుతున్నాయని సమాచారం. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారు పాతకార్డుల్లో ఉన్నటువంటి తమ వారి పేర్లను తొలగించకుండానే దరఖాస్తులు చేశారు. వీటికి ఆధార్ లింకు ఉండటం వల్ల కొత్తకార్డులకు దరఖాస్తులు చేసుకున్న వారందరి పేర్లు పాతకార్డుల్లోని సభ్యుల సరసన చేరిపోయాయి. దీంతో కార్డులు వచ్చినప్పటికీ బియ్యం పొందలేని పరిస్థితి ఏర్పడింది.
– మచ్చుకు కొన్ని ఘటనలు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ధన్వాడ పట్టణానికి చెందిన శాంతమ్మ, రాజులు భార్యాభర్తలు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. రేషన్ కార్డు కోసం పలుమార్లు దరఖాస్తులు సమర్పించిన మీదట ఎట్టకేలకు ఇటీవల మంజూరైనట్లు అధికారులు ప్రకటించారు. సంతోషంతో ఈ నెలలో బియ్యం కోసం రేషన్ షాప్నకు వెళ్లగా మీకు కార్డు రాలేదని, కుటుంబ సభ్యుల పేర్లన్నీ మీ మరిది కార్డులోకి వెళ్లిపోయాయని చెప్పారు. ఆయన నిన్ననే వచ్చి బియ్యాన్ని తీసుకెళ్లారని చెప్పడంతో శాంతమ్మ ఒక్కసారిగా హతాశురాలయ్యింది.
ధన్వాడకే చెందిన ఓ యువకుడు దామరగిద్ద గ్రామానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరి పేరుతో కొత్త రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. సంతోషపడ్డ ఆ యువకుడు ఈ నెలలో బియ్యం కోసం రేషన్ షాప్నకు వెళ్లగా మీ కార్డు రాలేదని తిప్పి పంపారు. నిశితంగా పరిశీలించగా ఈయన భార్య పేరు దామరగిద్దలోని తల్లిదండ్రుల రేషన్‌కార్డులో ఉండటంతో ఇతడి పేరు సైతం అదే కార్డులో నమోదైంది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వచ్చే నెలలోగా సరి చేస్తామని వివరించారు.
– వచ్చే నెలలోగా అన్నింటినీ పరిష్కరిస్తాం
వచ్చే నెలలోనైనా పాతరేషన్ కార్డుల్లో నమోదైన పేర్లను తొలగించి కొత్త కార్డుల్లో నమోదు చేస్తూ రేషన్ అందజేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ప్రస్తుతం కొత్తకార్డుదారులు అందరూ మే నెల రేషన్ బియ్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయమై ‘న్యూస్‌టుడే’ ధన్వాడ తహసీల్దార్ సింధూజతో మాట్లాడగా ఇలాంటి సమస్యలు తన దృష్టికి కూడా చాలా వచ్చాయన్నారు. జిల్లా అధికారులతో మాట్లాడగా సరి చేస్తున్నామని, వచ్చే నెలలో అన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారని ఆమె తెలిపారు.