ఇప్పటి నుంచి నేను బయటికి వస్తా, అందరి తరఫున పోరాడుతా : కేసీఆర్
– ఆపరేషన్ కగార్’ వెంటనే ఆపేయండి!
– ప్రభుత్వం నక్సలైట్లను చర్చలకు పిలవాలి
– తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ అని విమర్శ
– కళ్లముందే తెలంగాణ ఇలా అయిపోతుంటే దుఃఖం వస్తోందని ఆవేదన
– వరంగల్లో ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ కీలక ప్రసంగం
వరంగల్ ఏప్రిల్ 28(ప్రజాక్షేత్రం):ఇప్పటి నుంచి నేను బయటికి వస్తా.. అందరి తరఫున పోరాడుతానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. ఆనాడు, ఈనాడు, ఏనాడైనా తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీనేనని తీవ్రస్థాయిలో విమర్శించారు. 1956లో బలవంతంగా ఆంధ్రతో కలిపింది జవహర్లాల్ నెహ్రూనని, 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే నిరంకుశంగా అణిచివేసింది కాంగ్రెస్ పార్టీనేనని ధ్వజమెత్తారు. వరంగల్లోని ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలను ఉద్దేశిస్తూ, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివచ్చిన అందరికీ వందనాలు తెలిపారు. కన్నతల్లిని, జన్మభూమిని మించిన స్వర్గం మరొకటి ఉండదని శ్రీరాముడు ఏనాడో చెప్పారని గుర్తు చేశారు. వలసవాదుల విషకౌగిలిలో నలిగిపోతున్న నా భూమికి విముక్తి కల్పించాలని భావించానని, వలసవాదుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు ఒక్కడినే బయలుదేరానని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం నేను బయలుదేరిన నాడు కొందరు వెటకారం చేశారన్నారు. అన్నింటినీ అధిగమించి పోరాడి తెలంగాణను సాధించానని కేసీఆర్ వివరించారు.
ప్రజలు దీవిస్తే పదేళ్లపాటు ధగధగలాడే తెలంగాణను తయారు చేసుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. 1969లో మూగబోయిన తెలంగాణ ఉద్యమానికి మళ్లీ జీవం పోశానని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యం వేదికగా టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందని గుర్తు చేశారు. ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని ఆనాడు చెప్పాను, 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్ని బాధలు పడ్డారో నాకు తెలుసునని చెప్పారు. ఆనాడు కాంగ్రెస్, టీడీపీలో ఉన్న నేతలు పదవుల కోసం పెదాలు మూసుకుని కూర్చుకున్నాని ఆనాటి దృశ్యాలను గుర్తు చేశారు. శాసనసభలో తెలంగాణ అనే పదమే ఉపయోగించవద్దని రూలింగ్ ఇచ్చారని ధ్వజమెత్తారు.
“పదేళ్లపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి సాగుభూమిని గణనీయంగా పెంచాం. మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాం. అద్భుతమైన తెలంగాణను నిర్మించుకున్నాం. పంజాబ్‌ను తలదన్నేలా పంటలు పండే తెలంగాణను నిర్మించుకున్నాం. షేర్‌షా కాలం నుంచి స్వాతంత్ర్యం వచ్చేవరకు రైతుల నుంచి ఎన్నో పన్నులు వసూలు చేశారు. రైతుల నుంచి పన్నులు వసూలు చేసిన వారే తప్ప.. రైతుకు మేలు చేసిన వాళ్లు లేరు. రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని రైతుబంధు పథకం తీసుకువచ్చాను. రైతులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకున్న నాథుడు లేడు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబీమా అమలు చేసి రైతు కుటుంబాలను ఆదుకుంది.” – కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
– నకిలీ గాంధీల హామీలు ఎన్నో
కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు ఎన్నెన్నో చెప్పారని, దిల్లీ నుంచి వచ్చిన నకిలీ గాంధీలు ఎన్నో హామీలు ఇచ్చారని కేసీఆర్ విమర్శించారు. పింఛను రూ.2 వేలు ఉంటే రూ.4వేలు ఇస్తామన్నారు, మేం రైతుబంధు రూ.10 వేలు ఇస్తే రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని ఆరోపించారు. చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు, రూ.2 లక్షల రుణమాఫీని ఒక్క సంతకంతో రద్దు చేస్తామని చెప్పారు. కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందన్నారు. ధాన్యం తడిసినా, మొలకలు వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసేదని గుర్తు చేశారు.
– 2014 పరిస్థితులు మళ్లీ వచ్చాయి
భూముల ధరలు ఎందుకు తగ్గాయి, నీళ్లు ఎక్కడికి పోయాయని కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వడ్లు కొనే దిక్కు లేదు, కల్లాల్లో రైతులు ఏడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2014కు ముందున్న పరిస్థితులు మళ్లీ వచ్చాయని ఆందోళన చెందారు. పేదలు వేసుకున్న గుడిసెలను హైడ్రా పేరుతో కూల్చుతున్నారని, ఆనాడు చెరువుల్లో పూడికలు తీసిన బుల్డోజర్లు ఇవాళ ఇళ్లను కూలుస్తున్నాయని అన్నారు. నా కళ్లముందే తెలంగాణ ఇంత ఆగమైపోతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్నాళ్లు సమయం ఇవ్వాలని ఇన్నాళ్లు బయటకు రాలేదని, ఇన్నాళ్లు చూశాను, ఏడాదిన్నర పూర్తయ్యింది ఇంకెప్పుడు చేస్తారని అడిగారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి తెలివితో పని చేయాలన్నారు. ఎక్కడ పోగొట్టుకున్నామో మళ్లీ అక్కడే సాధించాలని అన్నారు. మాట్లాడితే బీఆర్ఎస్ పై నిందలు వేస్తున్నారని ఆగ్రహించారు. భూములు అమ్మొచ్చు.. అభివృద్ధి చేయొచ్చు కానీ యూనివర్సిటీ బూములు అమ్ముతారా అని కేసీఆర్ ప్రశ్నించారు.
– పోలీసులకు వార్నింగ్
- వైఎస్ఆర్ తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నేను రద్దు చేయలేదని కేసీఆర్ అన్నారు. ఎవరు తెచ్చినా బాగున్న పథకాన్ని కొనసాగించాలని చెప్పానని గుర్తు చేశారు. పేరు కూడా మార్చకుండా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని కొనసాగించామని తెలిపారు. బీఆర్ఎస్ సభ పెట్టుకుంటే ఆటంకాలు సృష్టించారని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ప్రభుత్వాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ప్రశ్నిస్తున్నారని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించిన వారిపై పోలీసు కేసులు పెడుతున్నారని, ప్రజలపై కేసులు పెడుతున్న పోలీసులు గుర్తించుకోవాలి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ఆపటం ఎవరితరం కాదని హెచ్చరించారు. పోలీసులకు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. కార్యకర్తలకు బీఆర్ఎస్ లీగల్ సెల్ అండగా ఉందని హామీ ఇచ్చారు.
