Praja Kshetram
తెలంగాణ

రాజీవ్‌ యువ వికాసం పథకం – అర్హుల ఎంపికకు దరఖాస్తుల వడపోత 

రాజీవ్‌ యువ వికాసం పథకం – అర్హుల ఎంపికకు దరఖాస్తుల వడపోత

 

– రాజీవ్ యువ వికాసం పథకం కోసం లబ్ధిదారుల ఎంపిక కోసం మార్గదర్శకాలు

– కమిటీల పర్యవేక్షణలోనే దరఖాస్తుల ఎంపిక

తెలంగాణ బ్యూరో ఏప్రిల్ 28(ప్రజాక్షేత్రం):రాజీవ్‌ యువ వికాసం పథకం మంజూరుకు దరఖాస్తులు చేసుకున్న వారిలో జిల్లాలో లబ్ధిదారుల ఎంపికకు అధికారులు దరఖాస్తుల వడబోత కార్యక్రమాన్ని అధికారులు వేగవంతం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు అర్హుల జాబితాను తయారుచేసేందుకు సంబంధిత శాఖల అధికారులతో మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు. తొలుత ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులను కార్పొరేషన్ల వారీగా విభజించారు. ఆ దరఖాస్తులను సంబంధిత అధికారుల పర్యవేక్షణలో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి అర్హులను ఎంపిక చేయాల్సిందిగా జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

– కమిటీల పర్యవేక్షణలోనే దరఖాస్తుల ఎంపిక

– మండల, పట్టణ స్థాయిలో పురపాలక కమిషనర్‌, ఎంపీడీవో కన్వీనర్‌గా మండల ప్రత్యేక అధికారి, సంబంధిత కార్పొరేషన్‌కు చెందిన ఒక అధికారి, డీఆర్‌డీవో నుంచి ఒకరిని, బ్యాంక్‌ మేనేజర్, సభ్యులుగా నియమించారు.

– జిల్లా స్థాయిలో కలెక్టర్‌ కన్వీనర్‌గా ఎనిమిది మంది వివిధ శాఖల అధికారులతో పాటు బ్యాంక్‌ అధికారి సభ్యులుగా ఉంటారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు దరఖాస్తులను పరిశీలిస్తారు.

– దరఖాస్తుదారుల్లో గతంలో ఐదు సంవత్సరాలుగా కార్పొరేషన్ల నుంచి రుణాలు పొందారా? ఆ కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారా? వారి ఆర్థిక స్థితిని పరిశీలించి మండల కమిటీకి ఇస్తారు. అక్కడి నుంచి జిల్లా కమిటీకి పంపిస్తారు.

– లబ్ధిదారుడు ఎంచుకున్న యూనిట్లను అనుసరించి రాయితీలు అందనున్నాయి. రూ. 50,000 నుంచి రూ.4,00,000 లక్షల వరకు రుణాలను అందిస్తుంది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు దరఖాస్తుల పరిశీలన జరుగుతుందని, కమిటీల పర్యవేక్షణలోనే పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నట్లు రాజీవ్‌ యువ వికాసం మహబూబాబాద్ జిల్లా నోడల్‌ అధికారి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ కె శ్రీనివాసరావు అన్నారు.

Related posts