Praja Kshetram
ఉద్యోగ సమాచారంవిద్యా

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ – త్వరలోనే భారీ సంఖ్యలో పోలీసు ఉద్యోగాల భర్తీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ – త్వరలోనే భారీ సంఖ్యలో పోలీసు ఉద్యోగాల భర్తీ!

 

-12 వేల వరకు ఖాళీలు ఉండవచ్చని అంచనా

– ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధంగా అధికారులు

– ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే నోటిఫికేషన్ విడుదల చేయనున్న టీఎస్ఎల్పీఆర్బీ

హైదరాబాద్ ఏప్రిల్ 28(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు కసరత్తు మొదలైంది. తాజా అంచనాల ప్రకారం సుమారుగా 12 వేల వరకు ఖాళీలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే అధికారులు ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొంతకాలంగా పోలీసుశాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి రిటైర్డ్ ద్వారా అవుతున్న ఖాళీలనే భర్తీ చేస్తుంటారు.

– ఒకేసారి 35 వేల ఖాళీలు

2007లో లుంబినీపార్కు, గోకుల్‌చాట్‌ వద్ద బాంబు పేలుళ్ల సంఘటన చోటు చేసుకోవడంతో పోలీసు శాఖను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఒకేసారి 35 వేల పోలీసు నియామకాలను చేపట్టాలని నిర్ణయించింది. ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో పోస్టులను భర్తీ చేయడం సాధ్యం కానందున, దఫదఫాలుగా నియామకం కొనసాగుతోంది. వివిధ కారణాలతో భర్తీ ప్రక్రియ అప్పుడప్పుడు వాయిదా పడుతోంది. కొత్తగా మంజూరైన పోస్టుల నియామక ప్రక్రియ చివరిదఫా 2022 సంవత్సరంతో పూర్తయింది.

– 12 వేల వరకు ఖాళీలు

అప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు 17 వేల పోస్టులను భర్తీ చేసింది. 2022లో చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపికై, శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సై, కానిస్టేబుల్స్‌కు 2024లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామకపత్రాలు అందించారు. ఇప్పుడు మరోసారి భారీ సంఖ్యలో పోలీసు నియమకాల భర్తీకి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం కానిస్టేబుల్, ఎస్సై స్థాయిలో దాదాపు 12 వేల వరకు ఖాళీలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య ప్రస్తుత సంవత్సరం పదవీ విరమణలతో ఇంకాస్త పెరిగే అవకాశముంది.

– నియామకాలకు సిద్ధంగా

ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ 2021 ఏప్రిల్‌లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో 2021లో పదవీ విరమణ చేయాల్సి వారు 2024 మార్చి వరకు ఆయా పదవుల్లో కొనసాగారు. 2024 ఏప్రిల్‌ నుంచి మళ్లీ ఉద్యోగ విరమణలు మొదలయ్యాయి. వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు పోలీసు ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నారు.

Related posts