Praja Kshetram
పాలిటిక్స్

ఏపీ నుంచి రాజ్యసభ రేసులో మంద కృష్ణ మాదిగ, అన్నామలై, స్మృతి ఇరానీ?

ఏపీ నుంచి రాజ్యసభ రేసులో మంద కృష్ణ మాదిగ, అన్నామలై, స్మృతి ఇరానీ?

 

– విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ

– మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగింపు

– ఇంకా ఖరారు కాని కూటమి తరఫున అభ్యర్థి… కొనసాగుతున్న ఉత్కంఠ

– చంద్రబాబు… మందకృష్ణ పేరు సిఫార్సు చేసినట్లు సమాచారం

– ప్రచారంలో అన్నామలై, స్మృతి ఇరానీ పేర్లు కూడా!

తెలంగాణ బ్యూరో ఏప్రిల్ 28(ప్రజాక్షేత్రం):ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ స్థానానికి నామినేషన్ల దాఖలు గడువు సమీపిస్తోంది. అభ్యర్థి ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఈ ఖాళీకి రేపు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. అధికార ఎన్డీయే కూటమి తరఫున అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఈ స్థానం బీజేపీ కోటా కింద భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వస్తూ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా, ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేరును ఈ రాజ్యసభ స్థానానికి చంద్రబాబు సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ స్థానం కోసం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలలోపు కూటమి తరఫున ఎవరు నామినేషన్ దాఖలు చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ రాజ్యసభ స్థానానికి రెండేళ్ల పదవీకాలం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Related posts