భూమి పట్టా కోసం.. యువకుడి వినూత్న నిరసన!
– చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ నిరసన
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 28(ప్రజాక్షేత్రం):తన భూమిని పట్టా భూమిగా మార్చాలంటూ ఓ యువకుడి చేపట్టిన వినూత్న నిరసన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చెట్టుకు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మంగళపల్లి గ్రామం వుల్లింతల జీవన్ తన భూమిని పట్టా భూమిగా మార్చాలని వందకు పైగా దరఖాస్తులు పెట్టుకున్నాడు. అధికారులు స్పందించకపోవడంతో తన భూమిలోని వేప చెట్టుకు ఆర్జీ కాపీలు అంటించి చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ నిరసన వ్యక్తం చేశాడు. ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ నిరసన వైరల్ గా మారింది. బాధితుడు వుల్లింతల జీవన్‌కు తన తండ్రి నుంచి వారసత్వంగా కొంత వ్యవసాయ భూమి సంక్రమించింది. ఈ భూమిని జీవన్ తండ్రి సుమారు 20 ఏళ్ల క్రితం మరొక వ్యక్తి నుంచి చట్టబద్ధంగా కొనుగోలు చేసి, అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారు. ఈ భూమికి సంబంధించి కొత్త, పాత పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్, పహానీ పత్రాలు వంటి అన్ని రికార్డులు తమ వద్ద ఉన్నాయని జీవన్ చెబుతున్నారు. అయితే గతంలో జరిగిన రెవెన్యూ రికార్డుల నమోదు ప్రక్రియలో పొరపాట్ల కారణంగా, ఈ భూమి సర్వే నంబర్ సీలింగ్ భూములలో నమోదైందని జీవన్ వాపోయాడు. దీని కారణంగా ప్రస్తుతం అధికారులు ఈ భూమిని నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చారని తెలిపారు. అసలు సీలింగ్ హోల్డర్ రెండు వేర్వేరు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ఏడాది కాలంగా తాను ఎమ్మార్వో, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానని, వందకు పైగా వినతి పత్రాలు సమర్పించినా ఎటువంటి పురోగతి లేదని జీవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా పలుమార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. ఈ క్రమంలోనే, తన గోడును అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేసేందుకు వినూత్న నిరసనకు దిగినట్లు తెలిపారు.