సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి.. గోడ కూలి ఏడుగురు మృతి
విశాఖపట్నం ఏప్రిల్ 30(ప్రజాక్షేత్రం):విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలింది. వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో సాఫ్ట్‌వేర్ దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు, శైలజ, ఆమె తల్లి పైలా వెంకటరత్నం, మేనత్త గుజ్జరి మహాలక్ష్మి ఉన్నట్లు నిర్ధారించారు. వీరంతా విశాఖపట్నం నగరానికి చెందినవారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.
– మృతుల వివరాలు
మాచవరం, తూర్పుగోదావరి జిల్లా పత్తి దుర్గాస్వామి నాయుడు (32), విశాఖపట్నం అడవివరం ఎడ్ల వెంకటరావు (48), మాచవరం, తూర్పుగోదావరి జిల్లా కుమ్మపట్ల మణికంఠ (28), విశాఖపట్నం హెబీ కాలనీ, వెంకోజీ పాలెంకు చెందిన గుజ్జరి మహాలక్ష్మి (65), విశాఖపట్నం ఉమానగర్, వెంకోజీ పాలెం పైలా వెంకటరత్నం (45), విశాఖపట్నం చంద్రంపాలెం, మధురవాడ పిళ్లా ఉమామహేశ్ (30), చంద్రం పాలెం మధురవాడ పిళ్లా శైలజ (26)లు ఉన్నారు.
– మృతులకు రూ.25లక్షల పరిహారం: చంద్రబాబు
సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు.
– రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం
సింహాచలం అప్పన్న చందనోత్సవంలో గోడకూలి ఏడుగురు చనిపోవడం ఘటన పట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ప్రధాని నరేంద్ర మోదీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. సింహచలం ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం వైఎస్.జగన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభృతులు తమ సంతాపం తెలిపారు.