Praja Kshetram
విద్యా సమాచారం

ప్రైవేట్ స్కూల్స్లో ఉచిత విద్య – ఈసారైనా అమలవుతుందా?

ప్రైవేట్ స్కూల్స్లో ఉచిత విద్య – ఈసారైనా అమలవుతుందా?

 

– హైకోర్టు ఆదేశాలతో 25 శాతం ఉచిత సీట్లపై పేద ప్రజల ఆశలు

– గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో అమలు కాని విద్యాహక్కు చట్టం

– వేలకు వేలు ఫీజులు కట్టలేక పేదల అవస్థలు

తెలంగాణ బ్యూరో 30(ప్రజాక్షేత్రం): విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను దివ్యాంగులు, నిరుపేదలకు కేటాయించి ఉచిత విద్యను అందించాలని నిబంధనలు చెబుతున్నాయి. వాటి అమలు మాత్రం మొన్నటి వరకు పేపర్లకే పరిమితమైంది. తాజాగా 2025 జూన్‌ నుంచి తెలంగాణ రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వం లిఖిపూర్వకంగా తెలిపిన నేపథ్యంలో విధివిధానాల తయారీకి కసరత్తు మొదలు పెట్టింది. దీంతో పేద ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇన్నాళ్లూ దక్కని హక్కు ఇక తమకు చేరబోతుందనే సంతోషం నిరుపేద బలహీన వర్గాల కుటుంబాల్లో కనిపిస్తోంది.

– 15 ఏళ్లుగా నిరీక్షణ

2009లో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయగా, సెక్షన్‌ 12(1)(సీ) ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో ఉచితంగా 25 శాతం మంది పేద పిల్లలను చదివించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. భారత రాజ్యాంగంలోని ఉచిత నిర్బంధ విద్యలో భాగంగా ఈ చట్టాన్ని పక్కాగా కార్యాచరణలో చూపించాలి.

– జీవో 44 ప్రకారం

అనాథలు, ఎయిడ్స్‌ బాధిత చిన్నారులకు, దివ్యాంగులకు 5 శాతం, బీసీ, మైనారిటీ, ఇతర వర్గాల పిల్లలకు 6 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం సీట్లు అందించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అయినా ఎక్కడా ఈ విధానం ఇప్పటివరకూ అమలవడం లేదు. పాఠశాలల యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి మరీ వేలకు వేల ఫీజులు వసూలు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

– విద్యాహక్కు చట్టం అమలైతే

ఒక్క ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే 850 వరకు ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయి. వాటిలో సుమారుగా 2.37 లక్షల మంది విద్యార్థులు వేల ఫీజులు చెల్లించి చదువుతున్నారు. ఒక్కో ప్రైవేటు పాఠశాలలో తక్కువలో తక్కువ 200 నుంచి 1200 మంది విద్యార్థులు ఉంటున్నారు. అందులో నుంచి 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయిస్తే ఉమ్మడి జిల్లాలో 40 వేల నుంచి 50 వేల మంది నిరుపేద విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. ప్రైవేటు స్కూల్స్ ఇకపై ఉచితంగా సీటు పొందిన విద్యార్థుల పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

Related posts