Praja Kshetram
తెలంగాణ

అలా చేస్తే అసైన్డ్‌ పట్టాలు రద్దు : మంత్రి పొంగులేటి

అలా చేస్తే అసైన్డ్‌ పట్టాలు రద్దు : మంత్రి పొంగులేటి

 

– జిల్లాకో మండలంలో రెవెన్యూ సదస్సు

– ఈ నెల 5 నుంచి 20 వరకు నిర్వహణ

– మే చివరికల్లా దరఖాస్తులకు పరిష్కారం

– సేకరించిన భూముల వివరాలు అప్‌డేట్‌

– అర్హులకు ఇందిరమ్మ స్కీమ్‌లో ఇండ్లు

– మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి

– జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌

తెలంగాణ బ్యూరో మే 02(ప్రజాక్షేత్రం):భూ భారతి చట్టం రూల్స్ ప్రకారంవచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రి పొంగులేటి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్‌తో కలిసి భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇండ్ల పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి మే 20 వరకు పైలట్ ప్రాజెక్టు జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలలో ఒక మండలాన్ని పైలట్‌గా తీసుకొని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఈ సదస్సులో భూ సమస్యల పై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలన్నారు. జూన్ 2 వరకు పైలట్ ప్రాజెక్ట్ క్రింద వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్త రెవెన్యూ సదస్సులు సుమారు 15 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. భూ భారతి చట్టంలో దరఖాస్తు చేసుకునే సమయంలో సరిగ్గా దరఖాస్తు నమోదు అయ్యేలా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వ భూములలో పొజిషన్ ఉన్న రైతుల దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలని, భూమి లేని నిరుపేదలు పోజిషన్ లో ఉంటే వారికి పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రితో చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.పట్టాలు ఉండి పొజిషన్ లో లేని దరఖాస్తులను కూడా పరిశీలించాలని అన్నారు. హై కోర్టు నుంచి అనుమతి రాగానే సాదా బైనామా దరఖాస్తులు పరిష్కారం చేయాలని, దీనికి అవసరమైన కార్యాచరణ పూర్తి చేయాలని మంత్రి సూచించారు. భూ సర్వే కు సంబంధించిన సమస్యలు, ఆర్.ఎస్.ఆర్ ఎక్సస్ సమస్యలు పరిష్కరించాలని, భూ సేకరణ కింద ప్రభుత్వం సేకరించిన భూముల రికార్డులు అప్ డేట్ చేయాలని మంత్రి కలెక్టర్ లను ఆదేశించారు. మే నెల చివరి వరకు రెవెన్యూ సదస్సులు వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేకుండా పరిష్కారం చూపాలని మంత్రి పేర్కొన్నారు. గతంలో పంపిణీ చేసిన అసైన్డ్ భూముల పట్టాలు ఎవరైనా విక్రయిస్తే ముందు ఆ పట్టాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు చేసిన వారు భూమి లేని నిరుపేద లైతే ప్రభుత్వం చర్చించి ఎంత భూమి క్రమబద్ధీకరించాలి అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అటవీ భూముల వివాదాల పరిష్కారానికి కూడా కృషి చేయాలని అన్నారు.

– పట్టణ ప్రాంతాల్లో 500 ఇండ్లు

కేంద్ర ప్రభుత్వ అర్బన్ పీఎం ఆవాస్ యోజన కింద లక్షా 13 వేల ఇండ్లు మంజూరయ్యాయని, ప్రతి నియోజకవర్గ పరిధిలోని పట్టణ ప్రాంతాలలో కనీసం 500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా చూడాలని మంత్రి అన్నారు. పి.ఎం.ఎల్.ఏ పోర్టల్ లో లబ్ధిదారుల ధ్రువీకరణ ఆధార్ నెంబర్ లతో పూర్తి చేయాలని, దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు మొదటి విడత కింద 700 కోట్ల పైగా నిధులు వస్తాయని అన్నారు. 600 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తే మనకు కేంద్ర ప్రభుత్వం నిధులు రావని, లబ్ధిదారులకు వివరించి రెండవ దశలో 600 చదరపు గజాల లోపు కట్టేలా చూడాలని అన్నారు. పైలట్ గ్రామాలలో మనం మంజూరు చేసిన 51 వేల ఇందిరమ్మ ఇండ్లలో ఇప్పటివరకు 10 వేల ఇంటి నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయని, 2019 ఇండ్లు బేస్‌మెంట్‌ పూర్తి చేసుకుంటే ఇటీవలే లక్ష రూపాయలు విడుదల చేశామని, ఇంటి నిర్మాణాలలో పురోగతి రావాల్సిందేనని, కలెక్టర్లు హౌసింగ్ శాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. మే 10వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో ఇండ్లు గ్రౌండ్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

Related posts