డ్రైవింగ్ సరిగ్గా రాకపోవడమే ప్రధాన కారణం
ప్రస్తుతం ఖాళీ మైదానంలోని ట్రాక్‌లో H ఆకారంలో, S ఆకారంలో, తర్వాత 8 ఆకారంలో ఉన్న ట్రాక్‌లో బండిని నడిపి ముందుకు వెళ్తే డ్రైవింగ్ లైసెన్సు ఇస్తుండేవారు. సరిగ్గా రివర్స్ తీయకపోయినా దళారుల సాయంతో పాస్ అవుతున్నారు. లైసెన్సు పొందిన వారిలో చాలా మంది వచ్చీరాని డ్రైవింగ్‌తోనే బైక్‌లు, కార్లు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. లేదంటే వీరి కారణంగా ఇతరులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాష్ట్రంలో 2023 సంవత్సరంలో 22,093 రోడ్డు ప్రమాదాలు జరిగితే, ఆ సంఖ్య 2024కి వచ్చేసరికే 25,934కి పెరిగింది. వరుసగా 28,682, 31,559 మంది రోడ్డు ప్రమాదాల్లో బాధితులయ్యారు. ప్రమాదాలకు సరైన డ్రైవింగ్ రాకపోవడం ఒక ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే డ్రైవింగ్ నైపుణ్యాన్ని మరింత పరీక్షించాలని రవాణా శాఖ నిర్ణయించింది. రవాణా శాఖ ప్రతిపాదించిన నూతన విధానంలో అటు మైదానంలో టెస్ట్ ట్రాక్‌తో పాటు దానికి ముందు సిమ్యులేటర్‌పై డ్రైవింగ్ పరీక్ష పెట్టనున్నట్లు సమాచారం. నిజమైన కారుకు ప్రతిరూపం లాంటిదీ సిమ్యులేటర్. ఇందులో కారులో మాదిరిగా స్టీరింగ్, క్లచ్, బ్రేక్, గేర్లు ఉంటాయి. ఇలా హార్డ్‌వేర్‌తో పాటు ఎదురుగా స్క్రీన్‌లో సాఫ్ట్‌వేర్ ఉంటుంది. తెరపై రహదారి, వాహనాలూ ఉంటాయి. సిమ్యులేటర్‌పై మీరు తిప్పే స్టీరింగ్, గేర్లను బట్టి వాహనం ముందుకు వెళ్తుంటుంది. పక్క నుంచి ఇతర వాహనాలు వెళుతుంటాయి. తెరలో రోడ్డుపై బాగా వర్షం కురుస్తుంటుంది. లేదంటే పొగమంచు పడుతుంటుంది. అప్పుడు మీ నైపుణ్యం ఎలా ఉందో విశ్లేషించి అంచనాకు వస్తారు.
– కెమెరాలో రికార్డింగ్
డ్రైవింగ్ పరీక్షకు హాజరయ్యే వ్యక్తుల ముఖ కవళికలు కెమెరాల్లో రికార్డు అవ్వగా, వాటిని కూడా పరిశీలిస్తారు. బాగా ట్రాఫిక్ ఉన్నప్పుడు, పక్కనుంచి వాహనం దూసుకుపోతున్నప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారు, ఒత్తిడికి గురవుతున్నారా? లేదా అన్నది విశ్లేషిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 61 ఆర్టీఓ కార్యాలయాలు ఉండగా, 18 కార్యాలయాల్లో 34 సిమ్యులేటర్లను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ ప్రతిపాదించింది. సిమ్యులేటర్లను ప్రైవేటు సంస్థల ద్వారా ఏర్పాటు చేయించాలని రవాణా శాఖ భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ పరీక్షకు అతి తక్కువ ఫీజును ప్రతిపాదించే సంస్థను టెండర్ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఫీజుల రూపంలో వచ్చే ఆదాయంలో 50 శాతం రవాణా శాఖకు ఇచ్చేలా అధికారులు నిబంధనలు పెట్టారు.