Praja Kshetram
క్రైమ్ న్యూస్

సంగారెడ్డిలో విషాద కథ… ఏం జరిగిందంటే

సంగారెడ్డిలో విషాద కథ… ఏం జరిగిందంటే

 

సంగారెడ్డి జిల్లా, మే 05(ప్రజాక్షేత్రం): ఆ వ్యక్తి భార్యతో చాలా విసిగిపోయాడు. పెళ్లైనప్పటి నుంచి ఏదో విధంగా భార్య వల్ల ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. ఎప్పటికైనా మారకపోతుందా అని ఎదురుచూశాడు. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా తన ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఎంతో విసిగి వేశారాడు సదరు భర్త. తన భార్యలో ఎప్పటికీ మార్పు రాదని భావించిన అతడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. భర్త చేసిన పని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగింది.. భర్త ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త ప్రాణాలు తీసుకున్నాడు. అంతేకాకుండా తనతో పాటు తన పిల్లల ప్రాణాలు కూడా తీశాడు భర్త. సుభాష్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి మల్కపూర్‌లో నివాసముంటున్నాడు. సదాశివ పేట మండలం ఆత్మకూరు ప్రైమరీ హెల్త్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే భార్యభర్తల మధ్య కొన్నేళ్లుగా విబేధాలు ఉన్నాయి. ఈ కారణంగా పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఇరువైపుల పెద్దలు వారిని కూర్చోబెట్టి సర్ధిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా విబేధాలు సమసిపోలేదు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం భార్య ఇళ్లు వదిలి వెళ్లిపోయింది. దీంతో సుభాష్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. భార్య ప్రవర్తనతో విసిగెత్తిన అతడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న ప్రకారం ముందు తన ఇద్దరు పిల్లలు కొడుకు మరియం, కూతురు ఆరాధ్యకు ఉరి వేసి హత్య చేశాడు. ఆపై అతడు కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనా స్థలంలో మృతుడు సుభాష్‌ రాసిన సూసైడ్ నోట్ లభించింది. భార్య ప్రవర్తన నచ్చకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో తెలిపాడు. అయితే సుభాష్ మూడు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడం.. పైగా దుర్వాసన రావడాన్ని గమనించిన చుట్టుపక్కల ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు పగులగొట్టి చూడగా ముగ్గురు కూడా తాడుకు వేలాడుతూ కనిపించారు. ముగ్గురు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. సుభాష్ భార్య ఎక్కడికి వెళ్లిందనే విషయంలో క్లారిటీ రాలేదు. భార్యభర్తల మధ్య విబేధాల కారణంగా సుభాష్ తన ఇద్దరు పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Related posts