Praja Kshetram
ఉద్యోగ సమాచారం

5వేల సర్వేయర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

5వేల సర్వేయర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

 

– 5000 సర్వేయర్ల భర్తీ చేసేందుకు నిర్ణయం

– 50రోజుల పాటు శిక్షణ – తర్వాత విధుల్లోకి తీసుకోనున్న ప్రభుత్వం

– మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి

హైదరాబాద్ మే 09(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్రంలో సర్వే విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు. అర్హులైన నిరుద్యోగులు ఈ నెల 17వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించిన మంత్రి త్వరలో 5వేల మంది లైసెన్స్​డ్​ సర్వేయర్లు అందుబాటులోకి వస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలో సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ శాఖపై మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్ధ ప్రకాష్, సీసీ‌ఎల్‌ఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం. మకరందు తదితరులు పాల్గొన్నారు. భూముల పంచాయితీలకు శాశ్వత పరిష్కారం కోసమే సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్​ను మరింత బలోపేతం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు భూమి సర్వే పటాన్ని జత పరచడం తప్పనిసరి చేసినట్లు తెలిపారు. దీంతో సర్వే విభాగం పాత్ర మరింత క్రియాశీలం కానుందని, భూ భారతి చట్టంలో పేర్కొన్నట్లు ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ప్రస్తుతం ఉన్న 402 మంది సర్వేయర్లు సరిపోరని వివరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒకవైపు లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను తీసుకోవడం, మరోవైపు సర్వే విభాగంలో ఖాళీ ఉన్న సర్వేయర్ పోస్టులు భర్తీ చేయడం ఇంకోవైపు భూముల సర్వేకు అవసరమైన అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

– శిక్షణ తర్వాత విధుల్లోకి

లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల పోస్టుల కోసం ఇంటర్మీడియట్ గణితం ఒక పాఠ్యాంశంగా ఉండి, కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఐ‌టీ‌ఐ నుంచి డ్రాఫ్ట్స్ మన్ (సివిల్), డిప్లొమా (సివిల్), బీటెక్ (సివిల్) లేదా ఇతర సమానమైన విద్యార్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. శిక్షణ ఫీజు ఓసీ అభ్యర్థులకు రూ.10వేలు, బీసీ అభ్యర్థులకు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2500 చెల్లించవలసి ఉంటుందని వివరించారు. ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాలలో 50 పనిదినాలలో తెలంగాణ అకాడమీ (ల్యాండ్ ఇన్ఫర్మేషన్ & మేనేజ్మెంట్) ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను పకడ్బంధీగా నిర్వహించి వీలైనంత త్వరగా లైసెన్స్‌ సర్వేయర్ల సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

Related posts