మీ పాత బండికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించట్లేదా?
– సెప్టెంబరు 30 తుది గడువు
– నంబరు ప్లేట్లు ఏర్పాటు చేసుకునే బాధ్యత యజమానులదే
హైదరాబాద్ బ్యూరో మే 10(ప్రజాక్షేత్రం):ఇకపై వాహనాలకు ఇష్టం వచ్చినట్లు చిన్నగా, పెద్దగా నచ్చిన ఆకృతుల్లో రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేటును బిగించుకోవడం అస్సలు కుదరదు. కేంద్ర ప్రభుత్వం గతంలోనే వాహనాలన్నింటికీ హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్పీ) బిగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే 2019 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత మార్కెట్లోకి విడుదలైన అన్ని వాహనాలకు ఈ ప్లేట్లనే బిగిస్తున్నారు. ఇకపై పాత వాహనాలకు సైతం ఇదే మాదిరిగా బిగించుకోవాలని తాజాగా కేంద్ర రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సెప్టెంబరు 30 తేదీని చివరి గడువుగా పేర్కొంది.
– నకిలీ నెంబర్లకు అడ్డుకట్ట.
హెచ్‌ఎస్‌ఆర్పీలపై అంకెలు, అక్షరాల పరిమాణం కాస్త పెద్దవిగా, చూస్తే స్పష్టంగా కనిపిస్తాయి. దూరం నుంచి వాహనాల నంబర్లను సులభంగా, సౌకర్యంగా గుర్తించవచ్చు. వాహనాలు రోడ్డు నిబంధనలు అతిక్రమించినా, మితిమీరిన వేగంతో ప్రయాణించినా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. దొంగతనాలకు పాల్పడే వారు నకిలీ నంబరు ప్లేట్లను బిగించుకుని పలు వాహనాలను ఎత్తుకుపోతున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది.
– ఖర్చును యజమానులే భరించాలి.
పాత వాహనాలకు హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు ఏర్పాటు చేసుకునే బాధ్యత, ఖర్చు యజమానులే పెట్టుకోవాలని స్పష్టం చేసింది. వాహనదారులు ఈ నంబరు ప్లేట్ కోసం వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వాహన వివరాలను వెబ్సైట్లో నమోదు చేసిన అనంతరం బుక్ చేసుకోవాలి. వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించాక ఆ ఫొటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల వద్దే నంబరు ప్లేట్లను బిగించే సదుపాయాన్ని కల్పించాలి. నంబరు ప్లేట్ల ధరలు డీలర్ల వద్ద కనిపించేలా చార్ట్ ప్రదర్శించాల్సి ఉంటుంది. వాహనాల డీలరు సిబ్బంది ఇంటికే వెళ్లి నంబరు ప్లేటు బిగిస్తే అదనంగా ఫీజు తీసుకోవచ్చు.
హెచ్‌ఎస్‌ఆర్పీ లేకుంటే ఏమవుతుందంటే?
– మీ వాహనాన్ని ఇతరులకు విక్రయించడం సాధ్యపడదు.
– రవాణా శాఖ, పోలీసుల పెట్రోలింగ్లో భాగంగా పట్టుబడితే వెంటనే కేసులు నమోదు చేస్తారు.
– ఇన్సూరెన్స్, పోల్యూషన్ ధ్రువపత్రాలను మంజూరు చేయరు.