రేషన్ కార్డులు వచ్చేదెన్నడో?
– దరఖాస్తుదారుల పడిగాపులు
– రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలు
హైదరాబాద్ మే 12(ప్రజాక్షేత్రం): రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదల ఆశలు నెలవేరేలా లేదు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కూడా ఆలస్యంగా సాగుతోంది. అర్హులైన వారికి కార్డులు మంజూరు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 32వేల కుటుంబాలకు మాత్రమే కొత్త కార్డులను ఇవ్వగలిగింది. కుటుంబసభ్యుల పేర్ల మార్పులు చేర్పులకు సంబంధించి 10.50 లక్షలమంది చేర్చి వీరికి మే నెలకు సంబంధించిన రేషన్ పంపిణీ చేయనుంది. మిగతా వారికి మంజూరు కావాలంటే మరో రెండు నెలల సమయం పట్టవచ్చని పౌరసరఫరాలశాఖ పేర్కొంది. దరఖాస్తులు పరిశీలనలో అవకతవకలు జరగకుండా అర్హతలేని వారి పేర్లు రాకుండా జాగ్రత్తలు పాటిస్తూ గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం అర్హులైన వారిందరికి రేషన్కార్డులు మంజూరుచేసి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటన చేసి ప్రజాపాలన, గ్రామసభలు, ప్రజావాణి, మీసేవ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కొత్తకార్డుల కోసం 2.50 లక్షల దరఖాస్తులు రాగా, కుటుంబసభ్యుల పేర్ల చేర్పుల కోసం 8.10 లక్షల వచ్చినట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం కార్డులు మంజూరుచేస్తే కొత్తగా లబ్ధిదారుల సంఖ్య 30 లక్షలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంది సర్వే చేపట్టారు. దరఖాస్తుదారులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక యాప్‌నకు అనుసంధానం చేశారు. ఈ యాప్‌లో దరఖాస్తుదారుడి పేరు ఎంటర్ చేయగానే వారి వివరాలు అన్ని యాప్‌లో కనిపిస్తాయి. దరఖాస్తుదారుల ఆదాయ స్థితిగతులు, గతంలో రేషన్ కార్డు ఉందా?, తల్లిదండ్రుల పేరిట గల రేషన్ కార్డులో పేర్లు ఉన్నాయా? తదితర అంశాలను అధికారులు, సిబ్బంది సర్వే చేస్తూ వారు చెప్పిన అంశాలను యాప్‌లో పొందుపరుస్తున్నారు.
– ఇదీ రేషన్ కార్డు లెక్కా!
రాష్ట్రంలో మే నెలలో రేషన్కార్డుల లబ్ధిదారుల సంఖ్య 2.93 కోట్లకు చేరింది. 11.15 లక్షల మంది లబ్ధిదారులు కొత్తగా చేరారు. వీరికి నెలకు 1.86లక్షల టన్నుల రేషన్ పంపిణీ చేయనుంది. జనవరిలో 89.95 లక్షలు కార్డులు, ఫిబ్రవరిలో 90.11 లక్షలు, మార్చి 91.19 లక్షలు, ఏప్రిల్లో 90.42లక్షలు కార్డులు ఉన్నాయి. కొత్త కార్డుల లబ్దిదారులు, చేర్చిన వారి సంఖ్య ఐదునెలల వరకు 19.15 లక్షల మంది రేషన్లబ్ధిదారులుగా గుర్తించారు. అయితే ఇందులో పెళ్లి చేసుకున్న వారిని పాత కార్డులనుంచి 7.10లక్షల మంది పేర్లు తొలగించారు. మే నెలల్లో కొత్తగా రేషన్తీసుకునే వారి సంఖ్య 12.10 లక్షల ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది.
– బియ్యం కోటా త్వరగా ఖాళీ
ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు మొదటి రోజు నుంచే క్యూ కడుతున్నారు. కోటా తెచ్చి ఐదారురోజుల్లోకే ఖాళీ అవుతోంది. రెండో విడత బియ్యం కోసం కార్డుదారులు ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్నెలలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కావడంతో 90శాతం మంది తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నెలలలో లబ్ధిదారుల సంఖ్య పెరగవచ్చని, గత నెలలో డీలర్లు సరిపడా కోటా తీసుకోకపోవడంతో కొంతమందికి రేషన్దొరకలేదని, ఈనెల అందరికి వచ్చేలా డీడీలు చెల్లించినట్లు వెల్లడించారు. సన్నిబియ్యం పంపిణీ నుంచి రేషన్దుకాణాలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. పీడీఎస్బియ్యం అక్రమ దందాకు చెక్పడిందని డీలర్లు చెబుతున్నారు.