Praja Kshetram
తెలంగాణ

తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..

తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..

 

  • ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉపరితల ఆవర్తనాలతో తెలంగాణలో వర్షాలు
  • క్యుములోనింబస్ మేఘాల వల్ల పగలు వేడి, సాయంత్రం వర్షం
  • రానున్న నాలుగు రోజులు ఈదురుగాలులతో కూడిన వర్ష సూచన
  • పశ్చిమ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ

హైదరాబాద్ మే 13(ప్రజాక్షేత్రం):ఉత్తర దక్షిణ ద్రోణితో పాటు ఉపరితల చక్రవాక ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండగా, సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు స్పష్టం చేశారు. ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. ఇదిలావుండగా, నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం నాటికి ఈ రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, అలాగే దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. రుతుపవనాల కదలిక ప్రభావంతో గత రెండు రోజులుగా నికోబార్ దీవుల సమూహంలో భారీ వర్షపాతం నమోదవుతోందని వాతావరణ విభాగం తెలియజేసింది.

Related posts