Praja Kshetram
తెలంగాణ

గిఫ్ట్‌ డీడ్‌ రద్దు చేయాలని ఇతర వారసులు కోరలేరు

గిఫ్ట్‌ డీడ్‌ రద్దు చేయాలని ఇతర వారసులు కోరలేరు

 

– దాత చనిపోయిన అనంతరం ఒక వారసుడికి ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేయాలని ఇతర వారసులు కోరలేరని స్పష్టం చేసిన హైకోర్ట్

హైదరాబాద్, మే 13(ప్రజాక్షేత్రం):సీనియర్‌ సిటిజన్స్‌ చట్టం కింద ఇలాంటి వినతి చేసే అవకాశం అసలే లేదని తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న పి. రోహిత్‌ సూర్య అనే వ్యక్తికి, ఆయన తాత సుబ్బారావు కొండాపూర్‌లోని జాగృతి ఫౌండేషన్స్‌లో 3, 4 అంతస్తులను రిజిస్టర్డ్‌ గిఫ్ట్‌ డీడ్‌ ద్వారా అందజేశారు. అయితే రోహిత్‌ తండ్రికి, సుబ్బారావు మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో గిఫ్ట్‌ డీడ్‌ రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని సుబ్బారావు రాజేంద్రనగర్‌ ఆర్డీవోను సంప్రదించారు. విచారణ జరిపిన ఆర్డీవో… సీనియర్‌ సిటిజన్స్‌ చట్టం ప్రకారం దాన్ని రద్దు చేయాలని సబ్‌ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఏకపక్షంగా రద్దు చేయడం చెల్లదని పేర్కొంటూ రోహిత్‌ హైకోర్టును ఆశ్రయించారు. సీనియర్‌ సిటిజన్స్‌ చట్టంలోని సెక్షన్‌ 23 (1)లో పేర్కొన్న విధంగా వృద్ధుల బాగోగులను చూసుకోవడం వంటి షరతులను గిఫ్ట్‌ డీడ్‌లో పేర్కొనలేదని తెలిపారు. అదీకాకుండా ఆర్డీవో ఆదేశాలు ఇచ్చిన తర్వాత తమ తాత చనిపోయారని తెలిపారు. అందువల్ల ఇతర వారసులు కూడా గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేయాలని కోరలేరని తెలిపారు. వాదనలు విన్న జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం.. దీంతో ఏకీభవించింది.. వృద్ధులు జీవించి ఉన్నంత వరకే సీనియర్‌ సిటిజన్స్‌ చట్టం వర్తిసుందని తెలిపారు. తాత చనిపోయిన దృష్ట్యా గిఫ్ట్‌ను రద్దు చేస్తూ ఆర్డీవో ఇచ్చిన ఆదేశాలను కొట్టివేశారు.

Related posts