పది తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా?
– కోర్సు ఎంపిక కోసం ఈ టిప్స్ మీ కోసమే
పది తర్వాత ఏ కోర్సు తీసుకోవాలని ఆలోచిస్తున్నారా?
– అందరితో సూచనలతో సతమతమవుతున్నారా?
– ఈ టిప్స్ పాటించి ఈజీగా ఏం చదవాలో నిర్ణయించుకోండి
తెలంగాణ బ్యూరో మే 15(ప్రజాక్షేత్రం):పదో తరగతి తర్వాత ఎన్నో కోర్సులు! వీటితో వేల సంఖ్యలో కెరియర్లకు మార్గం సుగమం చేసుకోవచ్చు. ఎంపికలో మాత్రం గుంపులో గోవింద అని, అందరు అందులో చేరుతున్నారని, స్నేహితులు చెప్పారని, అమ్మానాన్నల ఆశయమని, అవకాశాలు మెండుగా ఉన్నాయని నిర్ణయానికి రాకూడదు. ఇవేవి మీకు సరైనవి కాకపోవచ్చు. వీటి ఎంపికలో మీ ముద్ర లేకోపోవడమే ఇందుకు కారణం. మీ దారి మహోన్నతం కావాలంటే నిర్ణయం తీసుకోవాల్సింది మీరే!
ఎవరి మార్గాన్ని వారు నిర్ణయించుకునే అవకాశం పదో తరగతి తర్వాత వస్తుంది. ఉన్న వాటిలో గమ్యాన్ని చేర్చేదాన్ని ఎంచుకోవడమే ప్రధానం. ఇందుకు స్వీయ సామర్థ్యాలే కొలమానం. ప్రతి విద్యార్థీ ఎవరికి వారే ప్రత్యేకం. అందువల్ల నైపుణ్యాలు, ఆసక్తులు గుర్తించి, సరైన కోర్సు ఎంచుకుంటే మేటి భవిష్యత్తు దిశగా మొదటి అడుగు పడినట్లే!
– నిర్ణయం మీదే
మీ గురించి మీ కంటే ఎక్కువగా మరెవరికీ తెలీదు. స్వీయ సమీక్షే కీలకం. ఇందుకోసం మీ సామర్థ్యం, ఆసక్తులను పరిగణనలోకి తీసుకోండి. మీ బలహీనతలేమిటో గుర్తించి, వాటి ప్రకారం పది తర్వాత ఉన్న కోర్సుల జాబితాలో కొన్నింటిని వదిలేయండి. మిగిలినవాటిలో మీకు సరిపోయేది ఏదో ఎంచుకోవాలి. ఈ క్రమంలో సమగ్రత కొరవడకుండా చూసుకోండి. పది తర్వాత ఉన్న అన్ని కోర్సులు, మార్గాలపైనా అవగాహన పెంచుకోవాలి.
– సరిపోయేవి ఎంచుకోవాలి
పది తరగతి పూర్తిచేసుకున్న వారికోసం ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిప్లొమాలు, ఐటీఐ, వొకేషనల్ కోర్సులు, ఉద్యోగాలు, ప్రత్యేక డిప్లొమాలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ప్రాధాన్యం ఉన్నవే. అయితే మీకు సరిపోయేవి ఏవో మీరే గుర్తించాలి. ఉన్న వాటిలో ఏదో ఒక్కటి మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల బాగా ఆలోచించి, విశ్లేషించుకుని నిర్ణయం తీసుకోవాలి.
– సబ్జెక్టు రాదని మరో కోర్సు వద్దు
మ్యాథ్స్ అంటే భయం కాబట్టి బైపీసీ, సైన్స్‌పై ఆసక్తి లేక సీఈసీ ఇలా వేరే కోర్సులు తీసుకుంటే రాణించలేరు. ఎందుకంటే బైపీసీ తీసుకోవడానికి మ్యాథ్స్ రాకపోవడం కారణం కాకూడదు. సైన్స్ అంశాల్లో పట్టు లేదు, అందుకే ఆర్ట్స్ కోర్సుల్లో చేరాలని నిర్ణయించుకోవద్దు. ఏ అంశాల్లో ప్రావీణ్యం ఉందో గుర్తించి, సంబంధిత కోర్సులు ఎంచుకోవాలి. ఒక సబ్జెక్టులో ఆసక్తి, ప్రావీణ్యం లేదనే కారణంతో ఇంకో కోర్సు ఎంచుకోవద్దు. అన్ని కోణాల్లోనూ ఆలోచించి నిర్ణయానికి రావాలి.
– ఎవరికోసం కోర్సులు వద్దు
చదువులో రాణించలేని ఎక్కువమంది విద్యార్థులు చెప్పే ప్రధాన కారణం ఫలానా వాళ్ల ఒత్తిడితో ఇష్టం లేకుండా ఈ కోర్సులో చేరి నష్టపోయానని అంటారు. అందువల్ల తెలిసినవాళ్లు, బంధువులు సూచించారనో, స్నేహితులతో కలిసి ఉండొచ్చనో, ఎక్కవ డబ్బులు సంపాదించవచ్చనో, సులువుగా ఉత్తీర్ణత సాధించవచ్చనో, ఎక్కువ మంది చేరుతున్నారనో ఇలాంటి కారణాలతో కోర్సు, గ్రూపులను ఎంచుకోవద్దు. చేరిన కోర్సులో రాణించాల్సిన బాధ్యత మీదేనని మర్చిపోవద్దు. అందుకే ఎవరి భవిష్యత్తుని వాళ్లే నిర్ణయించుకుని కెరియర్ సౌధాన్ని నిర్మించుకోవాలి.
పిల్లల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని తల్లిదండ్రులు వారికి సరిపోయే కోర్సులను ఎంపిక చేయాలి. వ్యక్తిగత ఆశయాలను రుద్దితే భవిష్యత్తులో ఇద్దరికీ సమస్యే. కొన్నిసార్లు తీవ్ర ఒత్తిడితో అనుకోని పరిణామాలూ ఎదుర్కోవాల్సి రావచ్చు. పిల్లలపై వ్యక్తిగత ఆశయాలను రుద్దకూడదు. ఆసక్తి లేకుండా, తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే చదవాల్సి వస్తే వాళ్లు ఒత్తడికి గురవుతారు.