Praja Kshetram
క్రైమ్ న్యూస్

చార్మినార్ వద్ద భారీ అగ్నిప్రమాదం – 17 మంది మృతి   

చార్మినార్ వద్ద భారీ అగ్నిప్రమాదం – 17 మంది మృతి

 

– షార్ట్సర్క్యూట్ వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు భావిస్తున్న అధికారులు.

– ప్రమాద ఘటనపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్ మే 18(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ నగరంలోని చార్మినార్ పరిధిలో గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో రెండేళ్ల బాలుడు, ఏడేళ్ల బాలిక ఉన్నారు. ప్రమాద సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టి మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. భవనంలో చిక్కుకున్న కొంతమందిని వారు రక్షించారు. ప్రమాదం ధాటికి పలువురు స్పృహ కోల్పోయారు. బాధితులను చికిత్స నిమిత్తం ఉస్మానియా, హైదర్గూడ, డీఆర్డీవో ఆసుపత్రులకు తరలించారు. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేపింది.

ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో రెండేళ్ల బాలుడుతో పాటు ఏడేళ్ల బాలిక కూడా ఉన్నారు. ఒక్కసారిగా ఇంతమంది ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది. దట్టంగా పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక స్థానికులు ఇబ్బందులు పడ్డారు.

1) ప్రహ్లాద్‌ (70)

2) మున్నీ (70)

3) రాజేందర్‌ మోదీ (65)

4) సుమిత్ర (60)

5) పంకజ్‌ (36)

6) శీతల్‌ (35)

7) వర్ష (35)

8) రజిని (32)

9) అభిషేక్‌ (31)

10) హమే (7)

11) ప్రియాన్స్‌ (4)

12) ఇద్దు (4)

13) రిషబ్‌ (4)

14) ఆరుషి (3)

15) అనుయాన్‌ (3)

16) ఇరాజ్‌ (2)

17) ప్రీతమ్‌ (ఏడాదిన్నర)

– ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. అగ్నిప్రమాదంలో పలువురి మృతి తనను కలచివేసిందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు.

– ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ ఆరా

పాతబస్తీలోని గుల్జార్‌ హౌస్‌ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సీఎం ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. పోలీస్, ఫైర్ విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి సరైన వైద్య సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి కిషన్రెడ్డి కూడా సందర్శించారు.

– మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఏపీ సీఎం

గుల్జార్‌హౌజ్‌ అగ్నిప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు

– ఘటనా స్థలిని పరిశీలించిన మంత్రి పొన్నం

అగ్నిప్రమాద సమాచారం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి ఆయన వివరాలు తెలుసుకున్నారు. అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి, సౌత్‌జోన్‌ డీసీపీ స్నేహా మిశ్రాలతో మాట్లాడి ఘటనపై ఆయన ఆరా తీశారు.

“ఉదయం 6 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్‌ వల్లే ప్రమాదమని ప్రాథమిక సమాచారం. ప్రమాదం చిన్నదే అయినప్పటికీ ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. సహాయచర్యల్లో ఫైర్‌సిబ్బంది ఆలస్యం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. సహాయక చర్యలు వెంటనే ప్రారంభించి ఉంటే బాగుండేది. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఫైర్‌సిబ్బందికి సరైన పరికరాలు ప్రభుత్వం అందించాలి. బాధితులకు కేంద్రం తరఫున అండగా ఉంటామని భరోసా ఇస్తాం. బాధితులకు ఆర్థికసాయం అందేలా ప్రధానితో మాట్లాడతాను”- కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి

Related posts