ఎవుసం ఎట్లా…!
– ఖరీఫ్ కు సిద్దమయ్యేందుకు రైతన్న రందీ
– రబీ వరి కొనుగోలు డబ్బులు అందని వైనం
– రైతుభరోసాపై స్పష్టత కరువు
– ఏ యేడు జూన్ తొలివారంలోనే వర్షాలు
– పెట్టుబడి కోసం రైతన్నల ఆందోళన
కామారెడ్డి ప్రతినిధి, మే 20(ప్రజాక్షేత్రం):ఎద్దు ఏడ్చిన ఎవుసం… రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అనే నానుడి తెలంగాణలో ఎప్పటి నుంచో ఉంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతులను నెత్తిన మోసినట్లు మాటల్లో చెప్పినప్పటికీ ఆచరణ లో మాత్రం సాధ్యం అవడం లేదు. గత దశాబ్దాలుగా రైతులు దగా పడక తప్పడం లేదు. ప్రకృతి కనికరం చూపకపోయినా.. విజృంబించినా రైతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అయినప్పటికీ రైతులు అవసోపాలు పడి పంటను సాగు చేయడానికి అష్ట కష్టాలు పడుతున్నారు. పెట్టినంత పెట్టుబడి రాకపోయినా రైతు మాత్రం ఎవుసం ఆపడు. వీలైనంత వరకు పంట సాగు కోసం ఎంత కష్టం అయినా పండించడానికి శ్రద్ద చూపుతారు. అయితే ఈ సారి రైతన్నలకు ఎవుసం ఎట్లా అనే తీవ్రమైన రందీ మొదలైంది. ఖరీఫ్ సీజన్ కావడంతో పంటలు సాగు చేయడానికి రైతన్నలు సిద్దమవుతున్నారు. దుక్కులు దున్ని భూమిని సాగు కోసం సిద్దం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరో పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండడంతో ఎవుసానికి పెట్టుబడి కోసం డబ్బులు లేక రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. గత ఖరీఫ్ సీజన్ లో వర్షాలు మొహం చాటేయడంతో తిరిగి మరోసారి పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో అదనపు భారం పడింది. ఇదిలా ఉంటే ఖరీఫ్ లో పంట చేతికి వచ్చే సమయంలో వరుసగా ముసురు వానలు కురియడంతో పంట నష్టపోయి రైతులు ఆశించినంతా దిగుబడి రాక పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. కాగా రబీలో సాగు చేసిన పంటలు అంతంత మాత్రమే ఈ యేడు తీవ్రమైన ఎండల వల్ల వ్యవసాయ బోరుబావులన్నీ వట్టిపోయాయి. దీంతో రెండు ఎకరాలు ఉన్న రైతు ఎకరంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతటి గడ్డు పరిస్థితులను రైతులు చూశారు. ప్రస్తుతం మళ్లీ ఈ యేడు ఖరీఫ్ ఆరంభం కానుండడంతో రైతన్నలు సిద్దమవుతున్నారు. పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేక తిప్పలు తప్పడం లేదని వాపోతున్నారు.
– వరి కొనుగోలు చేసినా అందని డబ్బులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రబీలో సాగు చేసిన పంట వరి దాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించింది. ఇంకా కొనుగోలు కేంద్రాల్లో దాన్యం సేకరణ జరుగుతుంది. మరోపక్క అకాల వర్షాల వల్ల దాన్యపు రాసులు తడిసి ముద్దవడంతో కొందరి రైతులకు సంబందించి దాన్యం కొనుగోలులో మరింత ఆలస్యం అవుతుంది. మరో పక్క ప్రభుత్వం సేకరించిన దాన్యానికి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడంతో రైతులు ఎదురుచూసే పరిస్థితి నెలకొంది.
– రైతు భరోసాపై స్పష్టత కరువు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరానికి 7500ల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలో ఒకసారి మాత్రమే ఆ డబ్బులు జమ చేశారు. అది కూడా ఎకరాకు 6 వేల చొప్పున మూడు ఎకరాల లోపు వారికి మాత్రమే జమ చేశారని మిగతా వారికి జమచేస్తామని చెప్పిన ఎంత వరకు రైతులకు అందాయో స్పష్టత లేదు. కాగా ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ వస్తున్న ప్రభుత్వం రైతు భరోసాపై ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో రైతు భరోసా డబ్బులు పెట్టుబడి కోసం అందే పరిస్థితి లేదని పలువురు రైతులు పేర్కొంటున్నారు.
– ఈ యేడు జూన్ మొదటి వారంలోనే వర్షాలు..
ఈ యేడు జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురవనున్నాయనే వాతావరణ శాఖ అంచనాల మేరకు రైతులు అప్రమత్తం అవుతున్నారు. పంటకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, తదితర వాటిని సమకూర్చుకునే పనిలో నిమగ్నమైనప్పటికీ రైతులకు పెట్టుబడి రందీ మాత్రం వేదిస్తున్నట్లుగా కన్పిస్తుంది. పోయిన యేడు సకాలంలో వర్షాలు కురవక ఇబ్బందులు పడ్డ రైతన్నలు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ప్రస్తుతం ఈ యేడు వర్షాలు సరైన సమయంలో కురిసే వీలు ఉండడం వల్ల పంటల సాగు కోసం తిప్పలు పడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఖాతాల్లో జమచేసి రైతుకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది.