Praja Kshetram
తెలంగాణ

భూ వివాదం కేసులో బరితెగించిన పోలీస్..!

భూ వివాదం కేసులో బరితెగించిన పోలీస్..!

 

– కాసుల కోసం కక్కుర్తి

– భూ వివాదంలో జోక్యం

– చనిపోయిన వ్యక్తిపై కేసు

– ఠాణా ఆవరణలో మహిళా నిందితురాలిపై లైంగిక వేధింపులు

వరంగల్ మే 20(ప్రజాక్షేత్రం)పోలీస్ రక్షణలో ఉండాల్సిన వారే నిందితులకు సహకరిస్తే ఎలా? వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. వరంగల్ పరిధిలోని ఏజే మిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ జె. వెంకట రత్నంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక భూ వివాదం కేసులో బాధితులకు న్యాయం చేయకపోవడం, పైగా తప్పుడు కేసు నమోదు చేయడమే కాకుండా, ఈ కేసులో ఏకంగా 9 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తి పేరును కూడా చేర్చి నిందితులకు సహకరించినందుకు వెంకట రత్నంపై వేటు పడింది. ఇది ఎంత దారుణమంటే, చనిపోయిన వ్యక్తిని కూడా కేసులోకి లాగి, చట్టాన్ని ఆటబొమ్మగా మార్చిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. అంతేకాదు, మరో కేసులో మహిళా నిందితురాలిని పోలీస్ స్టేషన్ ఆవరణలోనే లైంగిక వేధింపులకు గురిచేసినట్లు విచారణలో నిర్ధారణ అయింది. తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడటం గర్హనీయం. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే, సామాన్యులకు దిక్కెవరు? పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తీసుకున్న ఈ కఠిన చర్య, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారికి ఒక హెచ్చరిక లాంటిది. వ్యవస్థలో ఇలాంటి అవకతవకలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సస్పెన్షన్ ఉదంతం స్పష్టం చేస్తోంది.

Related posts