Praja Kshetram
తెలంగాణ

బలగం సినిమా ఎఫెక్ట్.. 60 ఏళ్ల వయసులో కలిసిన అన్నాదమ్ములు.

బలగం సినిమా ఎఫెక్ట్.. 60 ఏళ్ల వయసులో కలిసిన అన్నాదమ్ములు.

 

రాజన్న సిరిసిల్ల మే 21(ప్రజాక్షేత్రం):టాలీవుడ్ డైరెక్టర్ వేణు యెల్దండి.. ఏ ముహూర్తాన బలగం సినిమా తీశాడో తెలియదు.. గానీ ఈ సినిమా ప్రభావం ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నాటుకుపోయింది. ఈ సినిమా రెండు అద్భుతాలు చేసింది. ఒకటి ఎలాంటి సందడి.. సప్పుడు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. రెండు ఎన్నో కుటుంబాలను ఈ సినిమా కలిపింది. అలా ఈ సినిమా మరో కుటుంబాన్ని నిలబెట్టింది. బలగం సినిమాను ఊళ్లలో పంచాయితీల వద్ద ప్రత్యేక తెరలను ఏర్పాటు చేసి మరీ ప్రదర్శించారు. ఎలాంటి ఖర్చు లేకుండా ప్రజలకు ఉచితంగా చూపించారు స్థానిక నాయకులు. ఈ సినిమాను చూసి కంటతడిపెట్టనివారు లేరు. కుటుంబాల్లోని బంధాలు, బంధుత్వాల విలువలు గురించి కళ్లకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్ వేణు యెల్దండి. అలా బలగం సినిమాను గుర్తుచేసుకుని అన్నాదమ్ములు కలిశారు. చిన్న చిన్న మనస్పర్థలతో 10 ఏళ్ల క్రితం విడిపోయిన ఆ అన్నాదమ్ములు ఎట్టకేలకు కలిసిపోయారు. 60 ఏళ్ల వయసులో పంతాలు విడిచిపెట్టి ఒక్కటయ్యారు. దీంతో ఇరు కుటుంబాలతో పాటు ఆ గ్రామంలో సందడి నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావు పేట మండలం, కొలనూరు గ్రామానికి చెందిన మామిండ్ల నాగయ్య, మామిండ్ల రాములు అన్నదమ్ములు. పదేళ్ల క్రితం చిన్న చిన్న మనస్పర్థలతో విడిపోయారు. ఒకే ఊరిలో ఉంటున్నా మాట్లాడుకోవడం మానేశారు. అయితే ఇరు కుటుంబాలు కలిసిపోవాలని మామిండ్ల నాగయ్య కుమారుడు శ్రీనివాస్.. ప్రయత్నించినా సాథ్యం కాలేదు. ఈ క్రమంలో ఇటీవల ఒక రోడ్డు ప్రమాదంలో నాగయ్య, రామయ్యల మేనల్లుడు కూన తిరుపతి మరణించాడు. దీంతో తిరుపతి అంత్యక్రియల్లో అన్నదమ్ములు ఇద్దరు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇద్దరిని కలపాలని శ్రీనివాస్ యత్నించాడు. వారికి పాత రోజులు, జ్ఞాపకాలను గుర్తు చేశాడు. దీంతో ఇద్దరూ కన్నీరు పెట్టుకున్నారు. దీంతో వాళ్లిద్దరూ ఆలింగనం చేసుకుని కంట తడి పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు చూసి అక్కడ ఉన్నవాళ్లు కూడా కంట తడి పెట్టుకున్నారు. కాటికి వెళ్లే ముందు పంతాలు, పట్టింపులు ఎందుకని.. ఇక నుంచి అందరం కలిసి బతుకుదామని అనుకున్నారు.

Related posts