గోదావరి ఖనిలో చూస్తుండగానే కుప్పకూలిన భవనం
– రామగుండంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు
– జేసీబీతో కూల్చివేస్తుండగానే కుప్పకూలిన భవనం
– జేసీబీ డ్రైవర్కు గాయాలు
పెద్దపల్లి మే 24(ప్రజాక్షేత్రం):పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రోడ్లను ఆక్రమించి ఉన్న భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇవాళ గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో ఓ భవంతిని కూల్చివేస్తున్న సమయంలో పెను ప్రమాదం తప్పింది. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో బిల్డింగ్ ముందు భాగాన్ని జేసీబీతో కూలుస్తున్నారు. ఈ సమయంలోనే అకస్మాత్తుగా భవనం మొత్తం కుప్పకూలింది. భవనం పెద్ద శబ్ధంతో కుప్పకూలడంతో పెద్ద ఎత్తున దుమ్ము గాల్లోకి లేచింది. దీంతో అక్కడున్న మున్సిపల్ సిబ్బంది, స్థానికులు భయంతో పరుగులు తీశారు. భవనం శిథిలాలు పడటంతో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. అయితే పోలీసులు ముందుగానే రోడ్డుపై రాకపోకలు నిలిపివేయడంతో పాటు విద్యుత్ సరఫరా ఆపేయడంతో ఎలాంటి సమస్య రాలేదు.
