Praja Kshetram
తెలంగాణ

సర్పంచ్ ఆశావహులకు గుడ్ న్యూస్..

సర్పంచ్ ఆశావహులకు గుడ్ న్యూస్..

 

– పంచాయతీ ఎన్నికలపై కీలక ప్రకటన!

తెలంగాణ బ్యూరో మే 27(ప్రజాక్షేత్రం):రాష్ట్ర వ్యాప్తంగా ఆశావహులు సర్పంచ్ ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీ కాలం ముగిసి 15 నెలలు కావొస్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల చేయడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఓ కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. జూన్ 2, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున లోకల్ ఎలక్షన్లపై సర్కార్ పెద్దలు లేదా సీఎం రేవంత్ రెడ్డే స్వయంగా కీలక ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా జూన్‌ 5లోగా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన కూడా రావొచ్చని సమాచారం. అయితే, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ సృజన, ఇతర ఉన్నతాధికారులతో తాజాగా సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమగ్రంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో.. ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధం చేసి ఉంచాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించనట్లుగా సమాచారం. మరోవైపు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, రాజీవ్ యువ వికాసం లాంటి పథకాలు సర్పంచ్ ఎన్నికల్లో కలిసి వస్తాయని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు సర్పంచ్ ఎన్నికల్లో బుద్ధి చెబుతారంటూ విపక్ష పార్టీల నేతలు కామెంట్ చేస్తున్నారు.

Related posts