టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా సీఎం చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక!
– మహానాడు వేదికపై ప్రమాణ స్వీకారం
– నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
– పార్టీని మరింత సమర్ధవంతంగా నడిపిస్తా
అమరావతి మే 28(ప్రజాక్షేత్రం):తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప మహానాడు వేదికగా చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. 1995లో తొలిసారిగా టీడీపీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అప్పటి నుంచి 35ఏళ్లుగా ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికవుతూ వస్తున్నారు. ప్రతి రెండెళ్ల కొకసారి అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తుండగా..12వ సారి చంద్రబాబు అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం విశేషం. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబుతో సీనియర్ నేత వర్ల రామయ్య ప్రమాణం చేయించారు. మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం చంద్రబాబు మహానాడులో పార్టీ శ్రేణులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. నా ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని.. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందన్నారు. నా బలం, బలగం టీడీపీ.. నాపై కార్యకర్తలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని..దేవుడు ఇచ్చిన శక్తితో పార్టీని మరింత సమర్థంగా నడిపించేందుకు కృషి చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. మహానాడులో ఆరు శాసనాలపై అర్థవంతంగా చర్చలు జరిగాయని..పార్టీ తరుపున రాబోయే 40 ఏళ్లకు ప్రణాళిక రచించుకున్నామని వెల్లడించారు.టీడీపీ అధికారంలో ఉంటే అందరికీ రక్షణ ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో మత ఘర్షణలను పూర్తిగా కట్టడి చేశామని గుర్తు చేశారు. నక్సలిజం రూపుమాపడానికి నిరంతరం పోరాడిన టీడీపీ.. రాయలసీమలో ఫ్యాక్షనిజం తుదముట్టించి అభివృద్ధికి బాటలు పరిచిందని చెప్పారు. రాయలసీమ రాళ్ల సీమ కాదు..రత్నాల సీమగా మారుస్తానని చెప్పామని..కోనసీమ కంటే సంపదలో అనంతపురం ముందుండడానికి టీడీపీ కారణమని చెప్పారు.. 2027 నాటికి పోలవరం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. హంద్రీనీవా కింద చివరి భూములకు నీళ్ల కోసం రూ.3,800 కోట్లు ఖర్చు చేశామన్నారు. పోలవరం తర్వాత హంద్రీనీవాకు భారీగా ఖర్చు చేస్తున్నామని.. వెలిగొండతో పాటు మిగతా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.