దమ్ముంటే సస్పెండ్ చేయండి… అందరి జాతకాలు బయటపెడతా: రాజాసింగ్ సవాల్
– సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయటపెడతానన్న రాజాసింగ్
– నోటీసులు కాదు, సస్పెండ్ చేయాలని డిమాండ్
– ఎవరి వల్ల పార్టీకి నష్టమో ప్రజల ముందుంచుతానని వెల్లడి
– తనకు నోటీసులు ఇస్తారన్న ప్రచారంపై రాజాసింగ్ స్పందన
హైదరాబాద్ జూన్ 02(ప్రజాక్షేత్రం):బీజేపీ పెద్దలపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తనకు నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన సోమవారం తీవ్రంగా స్పందించారు. తనకు నోటీసులు ఇవ్వడం కాదు, ధైర్యముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన సవాల్ విసిరారు. తనను సస్పెండ్ చేస్తే పార్టీలోని కొందరి అసలు స్వరూపాలను బయటపెడతానని, అందరి జాతకాలు ప్రజల ముందు ఉంచుతానని హెచ్చరించారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు, నాయకత్వానికి దూరంగా ఉంటున్నారనే ఆరోపణలతో పాటు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారనే కారణంతో రాజాసింగ్‌కు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతోందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.