శ్రీవారిని దర్శించుకున్న సోనూ సూద్
తిరుపతి జూన్ 02(ప్రజాక్షేత్రం): శ్రీవారిని దర్శించుకున్న సోనూ సూద్ ప్రముఖ నటుడు, మానవతావాది సోనూ సూద్ తిరుమల శ్రీవారి దివ్య దర్శనాన్ని పొందారు. సోమవారం తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ఆయన, ఆలయంలో వైభవంగా నిర్వహించిన వేద ఆశీర్వచన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు.
25 ఏళ్ల అనుబంధం – తిరుమల పట్ల సోనూ సూద్ అభిమానం
తిరుమలలో దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన సోనూ సూద్, “నేను మొదటిసారి తిరుమల శ్రీవారిని దర్శించినది 25 ఏళ్ల క్రితం. అప్పటి నుండి నాకు స్వామివారిపై అపారమైన భక్తి, నమ్మకం ఏర్పడింది. ప్రతి ముఖ్య ఘట్టంలో ఆయన ఆశీస్సులు తీసుకోవడానికే వచ్చాను” అంటూ భావోద్వేగంగా స్పందించారు. ఈరోజు నేను నా కుటుంబంతో కలిసి ఇక్కడికి వచ్చాను. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించాను. మేము ఒక కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నాం. ‘నంది’ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ కొత్త చిత్రంలో నేను నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నా. ఇది త్వరలో ప్రారంభమవుతుంది” అని వెల్లడించారు. ఈ సినిమా గురించి ఇతర వివరాలు వెల్లడించకుండా, త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. కోవిడ్ సమయంలో నిరుద్యోగులు, వలస కార్మికుల కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సోనూ సూద్, ఇప్పుడు తన నటన జీవితంలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. నటుడిగానే కాదు, మానవతా సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.