Praja Kshetram
విద్యా సమాచారం

నీట్‌ యూజీ ఫలితాలు వచ్చేశాయ్‌.. 

నీట్‌ యూజీ ఫలితాలు వచ్చేశాయ్‌..

 

-100లోపు ర్యాంకులతో సత్తాచాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

హైదరాబాద్ జూన్ 14(ప్రజాక్షేత్రం):ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్- యూజీ) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది. అంతకు ముందు ఫైనల్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శనివారం ఉదయం విడుదల చేసింది. ఆ తర్వాత కొన్ని గంటలకే తుది ఫలితాలను ఎన్టీఏ రిలీజ్‌ చేసింది. అభ్యర్థులకు మెయిల్స్‌ ద్వారా స్కోర్‌ కార్డులు అందుతున్నట్లు తెలుస్తోంది. నీట్‌ యూజీ 2025 పరీక్ష రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://neet.nta.nic.in/ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చని ఎన్టీఏ వెల్లడించింది. ఈ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన మహేశ్‌ కుమార్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఉత్కర్ష్‌ అవదియా రెండో ర్యాంకు, మహారాష్ట్రకు చెందిన క్రిషాంగ్‌ జోషి మూడో ర్యాంక్‌, ఢిల్లీ-ఎన్సీటీకి చెందిన మృణాల్‌ కిషోర్‌ ఝా నాలుగో ర్యాంక్‌, అవికా అగర్వాల్‌ ఐదో ర్యాంక్‌ సాధించారు. ఇక ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు టాప్ 100లో పలు ర్యాంకులను సాధించారు. జీవన్ సాయికుమార్ 18వ ర్యాంక్.. షణ్ముఖ నిషికాంత్ అక్షింతల 37వ ర్యాంక్, ఎం వరుణ్ 46వ ర్యాంక్, వై షణ్ముఖ్ 48వ ర్యాంక్, విదిశా మాజీ 95వ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఏపీకి చెందిన కార్తీక్‌ రామ్‌ కిరిటి 19వ ర్యాంకు, కొడవటి మోహిత్‌ శ్రీరామ్‌ 56వ ర్యాంక్‌, దేశిన సూర్య చరణ్‌ 59వ ర్యాంక్‌, పి. అవినాశ్‌ 64వ ర్యాంక్‌, వై. సమీర్‌ కుమార్‌ 70వ ర్యాంక్‌, టి. శివమణిది 92వ ర్యాంక్‌ సాధించారు. తెలంగాణ రాష్ట్రంలో 33 ప్రభుత్వ మెడికల్, రెండు డీమ్డ్, 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీలున్నాయి. వీటిలో మొత్తంగా 8,515 ఎంబీబీఎస్ సీట్లున్నట్లు సమాచారం. గత నెల మే 4వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్‌ యూజీ పరీక్షకు 20.8 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. 5,400కు పైగా కేంద్రాల్లో పటిష్ఠ భద్రత మధ్య ఈ పరీక్షను నిర్వహించారు. విదేశాల్లోని 14 కేంద్రాల్లోనూ నీట్‌ యూజీ పరీక్ష జరిగింది. ఈ సారి నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య తగ్గింది. నిరుడు జాతీయంగా 23లక్షలకుపైగా అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కాగా, ఈ సారి 20లక్షల మంది మాత్రమే రాశారు. ఈ సారి తెలంగాణ రాష్ట్రం నుంచి 72,507 మంది అభ్యర్థులు నీట్‌ యూజీ పరీక్షను రాశారు.

Related posts