తెలుగు చిత్ర పరిశ్రమకి గుడ్ న్యూస్ చెప్పిన భట్టి.. ఆనందంలో ప్రముఖులు
హైదరాబాద్ జూన్ 15(ప్రజాక్షేత్రం):గత రాత్రి తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సం హైదరాబాద్ లోని హైటెక్స్ లో అట్టహాసంగా జరిగింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలుగు చిత్రపరిశ్రమలో జరుగుతున్న అవార్డుల కార్యక్రమం కాగా, ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్‌రాజు ఎఫ్‌డీసీ ఎండీ హరీశ్, అల్లు అర్జున్, సుకుమార్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, నాగ్ అశ్విన్, మణిరత్నం హాజరయ్యారు. పుష్ప 2 సినిమాలో నటనకుగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు గద్దర్ అవార్డ్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణ సంస్కృతి, ఉద్యమ చైతన్యానికి ప్రతీక అయిన ప్రజాకళాకారుడు గద్దర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రథమంగా అందిస్తున్న తెలంగాణ గద్దర్ సినీ అవార్డులు – 2024 అందించడం గర్వకారణం అని భట్టి చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక హక్కుల కోసం గళం విప్పి, గజ్జలు మ్రోగించి, పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపిన గద్దర్ గారి జీవిత మార్గదర్శనమే ఈ అవార్డుల ప్రేరణ. 2011లో ఆగిపోయిన రాష్ట్ర సినీ అవార్డుల పునఃప్రారంభానికి మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.2014 నుంచి 2023 వరకు ఉత్తమ సినిమాలు, దర్శకులు, నటీనటులకు పురస్కారాలు అందిస్తుండగా, 2024కు చెందిన అన్ని కేటగిరీల కింద అవార్డులు ప్రకటించాం. తెలుగు సినీ రంగానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య పేర్లతో కూడా ప్రత్యేక పురస్కారాలు ఇవ్వడం గర్వకారణం అని అన్నారు.
ఇక మా ప్రభుత్వం తెలంగాణను సినిమా రాజధానిగా అభివృద్ధి చేయాలన్న దిశగా ముందుకెళ్తోంది.
సినిమా షూటింగ్ అనుమతులకు సింగిల్ విండో, టూరిజం లొకేషన్లలో షూటింగ్‌కు అవసరమైన సహాయం, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, కార్మిక సంక్షేమం వంటి అంశాల్లో గట్టి చర్యలు తీసుకుంటాం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్‌ను గ్లోబల్ సినిమా హబ్‌గా తీర్చిదిద్దే కార్యక్రమానికి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాం. తెలంగాణ గర్వించదగిన కళాకారుడు గద్దర్ పేరుతో ఈ పురస్కారాలను అందించడమన్నది సినిమా పరిశ్రమకు ఇచ్చే గౌరవానికి నిదర్శనం.తెలంగాణ గద్దర్ సినీ అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా ప్రత్యేక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు భట్టి.