ఏసీబీకి చిక్కిన బుదేరా పంచాయతీ కార్యదర్శి..
సంగారెడ్డి జూన్ 16(ప్రజాక్షేత్రం):ఇంటి నెంబర్, వాటర్ సర్వీసింగ్ షెడ్ ఏర్పాటు కోసం లంచం డిమాండ్ చేసిన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా గ్రామ పంచాయతీ సెక్రెటరీని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుదేరా గ్రామ పంచాయతీలో ఆ గ్రామానికి చెందిన వారు వాటర్ సర్వీసింగ్ షెడ్ నిర్మాణానికి పర్మిషన్, అదే విధంగా నూతన హౌస్ నంబర్ కేటాయింపు కోసం గ్రామ కార్యదర్శి పట్లోళ్ల నాగలక్ష్మి రూ.8వేలు లంచాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను సంప్రదించారు. కాగా సోమవారం బుదేరా లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో రూ.8 వేల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు నాంపల్లిలోని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఎవరైనా లంచం కావాలని అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు గానీ, 9440446106 వాట్సాప్ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.