ప్రైవేటు మోత….!
– వ్యాపారంలా మారిన చదువు
– ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కొరత
– అనుముతులు లేకున్నా చర్యలు శూన్యం
కామారెడ్డి, జూన్ 18 (ప్రజాక్షేత్రం):విద్యార్థులకు జ్ఞానాన్ని పంచాల్సిన విద్యా సంస్థలు … ధనార్జనే ద్యేయంగా కృషి చేస్తున్నాయి. విచ్చలవిడిగా ప్రైవేటు పాఠశాలలను ఏర్పాటు చేస్తూ అంతులేని మోత ఎత్తుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు భారం ఎంత అవుతున్నా … బిడ్డల భవిష్యత్తు కోసం వారు వెనుకాడడం లేదు. ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో విజ్ఞానాన్ని అందించేందుకు తల్లిదండ్రులు చదువుకు ఎంతైనా ఖర్చు చేయడానికి ముందుకు వస్తున్నారు.. ఇదే ప్రైవేటు పాఠశాలల వారికి ఆదాయ వనరుగా మారింది. దీంతో ప్రైవేటు పాఠశాలలను ఏర్పాటు చేసి ఆకట్టుకునేలా పేర్లతో ఇంగ్లీషు మీడియం చదువులంటూ విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. నర్సరీ స్థాయిలోనే సుమారు 3 వేల రూపాయలు ఒక్కో విద్యార్థికి వసూలు చేస్తున్నారు. దాంతో పాటు అదనంగా స్కూల్ డ్రెస్, పుస్తకాలు అంటూ మరో ఐదారు వేలు వసూలు చేస్తూ ప్రైవేటు పాఠశాలల్లో విద్య దందాలా మారిపోయింది. కామారెడ్డి జిల్లాలోనూ ప్రతీ ఏటా కొత్త కొత్త పేర్లతో ప్రైవేటు పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి. నిబందనలకు విరుద్దంగా ఉన్నా వాటి పట్ల అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇదే అదునుగా చేసుకొని మరి కొన్ని పాఠశాలలు నెలకొల్పుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏడు పాఠశాలలకు గుర్తింపు లేదని అందులో ఎవరి పిల్లలను చేర్పించొద్దని విద్యాశాఖ అధికారులు పత్రికా ప్రకటన ద్వారా తల్లిదండ్రులకు సూచన చేసి వదిలేశారు తప్పా వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అనుమతులు లేనప్పుడు అదికార యంత్రాంగమే చర్యలు తీసుకోవాలి కానీ అటువంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
– వ్యాపారంలా మారిన చదువు…
చదువు ఇప్పుడు పెద్ద వ్యాపారంగా మారిపోయింది. పెద్ద పెట్టుబడి లేని వ్యాపారంలా ప్రైవేటు పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. అర్హత లేని వారిని నియమించుకొని పాఠాలు బోధిస్తున్నారు. నర్సరీ స్థాయి నుంచే ఇంగ్లీషు మీడియం అనే పదాన్ని ఒత్తి ఒట్టి చెప్పడం, సీబీఎస్ఈ సిలబస్ అంటూ ఆకట్టుకుంటున్నారు. దీంతో చేసేదేమి లేక తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించక తప్పడం లేదు. ఎటువంటి ఆదాయ కొరత లేకుండా ఉండడంతో ప్రైవేటు పాఠశాలలకు వరంగా మారింది. గతంలో వచ్చిన ర్యాంకులను ప్రచారం చేసుకుంటూ ఆకట్టుకుంటూ ప్రైవేటులో ఫీజులు ఎంత మోపిన విద్యార్థుల తల్లిదండ్రులు మోయకతప్పడం లేదు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలేబుల్ స్కీం కింద ఏ ఒక్క ప్రైవేటు పాఠశాల ముందుకు రాకపోవడం శోఛనీయం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారు 50కి పైగా ఉన్నప్పటికీ కేవలం మూడు పాఠశాలలు మాత్రమే బెస్ట్ అవైలేబుల్ స్కీం కింద దరఖాస్తులు చేసుకోవడానికి ముందుకు వచ్చాయి. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ అవకాశం ఇవ్వొద్దనే కేవలం వ్యాపార కోణంలోనే చూస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం బెస్ట్ అవైలేబుల్ స్కీం పట్ల కఠినంగా వ్యవహరించకపోవడం కూడా ప్రైవేటు పాఠశాలల వారికి అలుసుగా మారిందని చెప్పవచ్చు.
– ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కొరత.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో విద్యార్థులు ప్రభుత్వ బడులకు వెళ్లాలంటే ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. శిథిలావస్థకు చేరిన తరగతి గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడక తప్పడం లేదు. దీంతో చేసేదేమి లేక విద్యార్థులు ప్రభుత్వ బడులకు వెళ్లాలంటేనే జంకాల్సిన పరిస్థితి నెలకొంది. అటు ప్రభుత్వ బడుల్లో మౌళిక సదుపాయాలు కల్పించడంలోనూ అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారని చెప్పక తప్పదు. ఇటువంటి కారణాలతో విద్యార్థుల తల్లిదండ్రులు భారమైనా ప్రైవేటుకు పంపాల్సిన పరిస్థితి నెలకొంది.
– అనుమతులు లేకున్నా చర్యలు శూన్యం.
కొత్తగా ఏర్పాటు చేస్తున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలకు ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు ఎటువంటి పకడ్బందీ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో యదేచ్చగా వారు తమ విద్య వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అరకొర వసతులు, ఇరుకైన గదుల్లో ప్రైవేటు పాఠశాలలు కొనసాగిస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా విద్య వ్యాపారాన్ని కట్టడి చేయకపోతే భవిష్యత్తులో మరింత ఫీజుల మోత పెరిగే అవకాశం లేకపోలేదని పేర్కొంటున్నారు. అలాగే అటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ మౌళిక సదుపాయాల పట్ల అధికారులు శ్రద్ధ తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.