తహశీల్దార్ లంచావతారం.. వీడియో వైరల్..
భద్రాద్రి కొత్తగూడెం జూన్ 21(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో అవినీతి అధికారులు మితిమీరిపోతున్నారు. సామాన్యుల నుంచి ముక్కుపిండి మరీ లంచాలు వసూలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు రాష్ట్రంలో అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నా.. అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం తహశీల్దార్ లంచావతారానికి సంబంధించిన ఓ వీడియో వైరల్గా మారింది. తహశీల్దార్ రాజారావు నెల్లిపాక రెవెన్యూ పరిధిలోని భూ పట్టా పాస్ బుక్కులో పేరు మార్చడం కోసం ఓ రైతు దగ్గర లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతు రూ. 7వేలు తీసుకుని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. వీడియో కెమెరా ఆన్ చేసి సెల్ ఫోన్ జేబులో పెట్టుకొని ఎమ్మార్వో రాజారావుకు డబ్బులు ఇస్తూ వీడియో రికార్డు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో షోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో “రూ.7వేల ఇస్తావా.. ఇంకా ఎక్కువ ఇవ్వు అంటూ” సదరు అధికారి రైతు నుంచి డబ్బులు అడగడం కనిపిస్తోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.