సెప్టెంబర్ 30లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి : హైకోర్టు
హైదరాబాద్ జూన్ 25(ప్రజాక్షేత్రం):గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తీర్పులో స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తమకు రిజర్వేషన్లు పూర్తి చేసేందుకు 30 రోజులకు గడువు కావాలని హైకోర్టుకు విన్నవించింది. అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వం రిజర్వేషన్లు తమకు అందించాక ఎన్నికల నిర్వహణకు 60 రోజుల సమయం కావాలని కోర్టును కోరింది. ప్రభుత్వం, ఎన్నికల సంఘం వాదనలు విన్న హైకోర్టు జస్టిస్ మాధవి ధర్మాసనం సెప్టెంబర్ 30లోగా ఎన్నికల నిర్వహించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆరుగురు మాజీ సర్పంచ్ లు కోర్టును ఆశ్రయించారు. 2024జనవరిలోనే గ్రామపంచాయతి పాలకవర్గాల పదవి కాలం ముగిసిపోయిందని..ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తుందని..వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించాలని వారు పిటిషన్ లో కోరారు. ఈ పిటిషనర్లను విచారించిన హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ తీర్పు నిచ్చింది. ప్రస్తుతం పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది. పాలక వర్గాలు లేక పంచాయతీల్లో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని..పారిశుధ్యం అధ్వాన్నంగా తయారైందన్న ప్రభుత్వం వెంటనే ఎన్నికలు జరుపాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉండటంలో ఈ దఫా సెప్టెంబర్ 30లోపు పంచాయతీ ఎన్నికలు పూర్తవుతాయని భావిస్తున్నారు.